సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
కాంగ్రెస్‌తో అవగాహన ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిందే..
రెండో రోజు సీపీఐ రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలు ఆమోదం
నవతెలంగాణ- జగద్గిరిగుట్ట
స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, నిటి ఆయోగ్ తదితర వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. చివరకు ప్రధానమంత్రి కార్యాలయం ఏది చెబితే రాష్ట్రపతి భవన్ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందన్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను, ప్రయోజనాలను కాపాడటంలో ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారంలో కామ్రేడ్ ‘ఎన్.బాలమల్లేశ్ హాల్’లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలో గురువారం రెండో రోజు ప్రతినిధుల సభలో నారాయణ ప్రసంగించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థను కుదించి దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రం చెబుతున్నట్టు దేశాభివృద్ధి జరగడం లేదని, కార్పొరేట్ సంస్థల అభివృద్ధికి కుట్ర జరుగుతున్నదని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే వారిని రాజకీయ కక్షతో జైల్లో పెట్టడం, మావోయిస్టుల అంతం పేరుతో అటవీ, గిరిజన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. 30 రోజులు జైల్లో ఉంటే చట్టసభల పదవులను రద్దు చేసేలా చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక వేళ అలాంటి చట్టం తీసుకొస్తే దాదాపు రెండేండ్లు జైల్లో ఉన్న అమిత్‌షా పదవినే తొలుత రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం అమెరికాకు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తి రాత్రికి రాత్రి మాయం కావడం దేశ చరిత్రలో మొదటిసారని, ఇది చాలా ఘోరమని అన్నారు. చివరకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రజాప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పార్టీ సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే మరుసటి రోజే వారు జైల్లో ఉంటారన్నారు. ఆ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ విధానాలను అవలంబించినా అందుకు మద్దతు తెలపాల్సిన అవసరం లేదన్నారు. విధానాల ఆధారంగా మద్దతివ్వాలని, అవసరమైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించాలని వారు చేస్తున్న పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతివ్వాలని, వారితో కలిసి కదనరంగంలోకి దిగాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ, రాష్ట్ర, వివిధ జిల్లాల, నియోజకవర్గాల, మండలాల, నగర నాయకులు, నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పలు తీర్మానాలు ఆమోదం
సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలో పలు తీర్మానాలు ప్రకటించారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతోపాటు అర్హులైన గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తీర్మానం చేశారు. కార్మికులకు రూ.26 వేలు, స్కిల్డ్ వర్కర్లకు రూ.42 వేల కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వంలో టీజీఎస్‌ఆర్టీసీ విలీనం ప్రక్రియను పూర్తి చేయాలని, సంస్థలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని మహాసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసుఫ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతోపాటు అర్హులైన గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కల్లూరి వెంకటేశ్వరరావు కోరారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.సూర్యనారాయణ, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి ఏడు దశబ్దాలుగా సాగు నీటికి నోచుకోని 57 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించాలని కొండపర్తి గోవిందరావు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి జీఓ 60 ప్రకారం రూ.13,600 వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా పెట్టిన తీర్మానాలను సభ ఆమోదించింది.
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ యూనియన్ నాయకులు కె.ఏసురత్నం, సింగరేణి సంస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండరాదని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.రంగయ్య తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని శ్రామిక ఫోరం నాయకురాలు పి.ప్రేమ్‌పావని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని హైకోర్టు న్యాయవాది కె.ప్రభాకర్ రావు, జాబ్ క్యాలెండర్ అమలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నెర్లకంటి శ్రీకాంత్, కులవివక్ష, దళితులపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని డీహెచ్‌పీఎస్ నాయకులు టి.లక్ష్మణ్ ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
గీత పనివారల పెండింగ్ ఎక్స్‌గ్రేషియా రూ.13 కోట్లు వెంటనే చెల్లించాలని, 1/70 చట్టం పరిధిలోని ప్రాంతాల్లో టీఎఫ్‌టీ, టీసీఎస్‌లలో గీత కార్మికులకు సభ్యత్వం కల్పించి ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే అన్ని ప్రయోజనాలనూ వర్తింపజేయాలని గీతపనివారల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మగాని నాగభూషణం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES