Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపదవి ఉన్నా.. లేకున్నా మీ వెంటే..

పదవి ఉన్నా.. లేకున్నా మీ వెంటే..

- Advertisement -

– రాజకీయ కారణాలతోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక
– నన్ను ఆ కుట్రదారులు రకరకాలుగా వేధిస్తున్నారు : సింగరేణి కార్మికులకు కల్వకుంట్ల కవిత లేఖ
– కొప్పుల ఈశ్వర్‌ కు శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా, లేకపోయినా కార్మికుల వెన్నంటి ఉంటాననీ, వారికి ఏ కష్టం వచ్చినా అండదండగా ఉంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె సింగరేణి బొగ్గు గని కార్మికులను ఉద్దేశించి లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షునిగా తన తండ్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తాను రాసిన లేఖను లీక్‌ చేసిన ఆ కుట్రదారులే తనను రకరకాలుగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతుంటే కొందరు తనపై చేస్తున్న కుట్రలతో వ్యక్తిగతంగా తనకు నష్టం లేదని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే వారి లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆమె ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు తాను ఎన్నో లేఖలు రాశానని తెలిపారు. అయితే తాను బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగంపై ప్రజల అభిప్రాయాలు రాసిన లేఖను లీక్‌ చేశారని గుర్తుచేశారు. ఆ కుట్రదారులను బయటపెట్టాలని తాను కోరితే, ప్రశ్నించడమే తప్పన్నట్టు తనపై కక్ష కట్టారని తెలిపారు. పార్టీ మేలు కోరి లేఖ రాస్తే లీక్‌ చేసిన కుట్రదారుల పేర్లు బయటపెట్టమంటే కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సంస్థలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే కేసీఆర్‌ను ఒప్పించి తిరిగి డిపెండెంట్‌ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధ్దరించేలా చేసి 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌, రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్‌ లోన్‌పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్‌కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ సదుపాయం, మ్యాచింగ్‌ గ్రాంట్‌ పది రెట్లు పెంచేందుకు పాటు పడినట్టు ఆమె చెప్పారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం తీసుకొచ్చానని పేర్కొన్నారు. అంబేద్కర్‌ జయంతికి పూర్తి వేతనంతో కూడిన సెలవు, సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ఆప్షనల్‌ సెలవుల మంజూరు కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం, క్యాడర్‌ స్కీం, మరణించిన లేదా మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్‌ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం తదితర ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశానని కవిత గుర్తుచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad