టీఏఎఫ్‌ఆర్సీ నిబంధనలకు సవరణ
ఆరు అంశాల ప్రాతిపదికన ఖరారు చేయాలి
విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫీజుల నిర్ధారణకు సంబంధించి 2006లో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) రూపొందించిన నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం జీవో 33ను విడుదల చేశారు. ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజులకు సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి చైర్మెన్‌గా అధికారుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పలుమార్లు సమావేశమై 2025-28 బ్లాక్ పీరియెడ్ ఫీజులకు సంబంధించి అనేక అంశాలపై చర్చించింది. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు ఉన్నత విద్యామండలి చైర్మెన్, అధికారుల కమిటీ చైర్‌పర్సన్ వి బాలకిష్టారెడ్డి నివేదికను సమర్పించారు. అనంతరం ఉత్తర్వులను విడుదల చేశారు. ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
కాలేజీల్లో అంతర్గతంగా అందుకు సంబంధించి హామీ ఇచ్చేలా విధానం ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మద్దతుగా ఉండాలనీ, వారి హాజరు, విద్యాపరమైన ప్రగతి, ప్లేస్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయాలని సూచించారు. ఆధార్‌తో అనుసంధానమైన విధానంతో నగదు చెల్లింపులుండాలనీ, అకౌంట్లు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలని కాలేజీ యాజమాన్యాలను కోరారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడం, అవార్డులు పొందడం, పరిశోధన పత్రాలను సమర్పించడంతో పాటు స్టార్టప్‌లు ప్రారంభించిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంకేతిక విద్య పురోగతికి దోహదపడేలా ప్రణాళికను రూపొందించాలని వివరించారు. ఈ అంశాల ఆధారంగా ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజులు పెంచాలని సూచించారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజులపై ప్రశ్నార్థకం
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజులకు సంబంధించి ప్రశ్నార్థకంగా మారింది. పాత ఫీజులు వర్తిస్తాయా? లేదంటే పెరుగుతాయా? అనే దానిపై స్పష్టత లేదు. పాత ఫీజులనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ కొన్ని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఖరారు చేసిన ఫీజులను నిర్ణయించాలని కోరాయి. ఆ ఫీజులను వసూలు చేసుకోవడానికి రెండు కాలేజీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మరికొన్ని కాలేజీల పిటిషన్లను కొట్టేసింది. రెండు కాలేజీలకు ఫీజులను పెంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ టీఏఎఫ్‌ఆర్సీ, సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కౌంటర్ దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు అయ్యే అవకాశమున్నది.
ఇంజినీరింగ్ ఫీజుల పెంపునకు పచ్చజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES