Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబహుముఖ ప్రజ్ఞాశాలి 'తంగిరాల'

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘తంగిరాల’

- Advertisement -

– కథలు, కావ్యాల నుంచి నాటకాల వరకు 50కి పైగా పుస్తకాలు రాశారు
– చివరి వరకు కమ్యూనిస్టుగా నిరాడంబరంగా జీవించారు
– వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులెదురైనా దారి తప్పలేదు
– సినారె నుంచి నేటి తరం వరకు చిరపరిచితుడు : తంగిరాల సంస్మరణ సభలో వక్తలు
– అశ్రునివాళి అర్పించిన మిత్రులు, సన్నిహితులు, సాహితీ ప్రియులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”తంగిరాల చక్రవర్తి మరణించ లేదు. తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ఆయన సజీవంగా ఉంటారు. కథ, కవిత, నాటకం, వ్యాసం, నవల, గ్రంథసమీక్ష, విమర్శ మొదలైన ప్రక్రియల్లో అక్షర సేద్యం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దారి తప్పలేదు. చివరి వరకు కమ్యూనిస్టుగా నిరాడంబరమైన జీవితం గడిపారు” అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త తంగిరాల చక్రవర్తి సంస్మరణ సభను గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్న సన్నిహితులు, మిత్రులు, సాహితీ ప్రియులు అశ్రునివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మరణంతో తెలుగు సాహితీ లోకం గొప్ప సాహితీ వేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ పాత్రికేయులు, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ తంగిరాల కవిగా, రచయితగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. ”అక్షరం తెలియని అధికారానికి బానిసను చేస్తుంది. కాని తంగిరాల మాత్రం చివరి వరకు అలాంటి అధికారానికి ప్రభావితం కాలేదు. విజ్ఞాన కేంద్రాన్ని త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి వరకు తీసుకెళ్లారు. మనిషిగా స్పష్టమైన అభిప్రాయం కలిగిన ఆయన సాహిత్యానికి వారధిగా పని చేశారు.’ఆయన విండో ఆఫ్‌ లిటరల్‌ వరల్డ్‌’ అని చెప్పవచ్చు.

సాహిత్యంలోని ప్రశ్నలకు తంగిరాల సమాధానం అంటే అతియోశక్తికాదు” అని తెలకపల్లి వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ ఉద్యోగంలో, ఉద్యమంలో, సాహిత్యంలో, సమాజంలో వస్తున్న సమకాలీన మార్పులను సమన్వయం చేసుకుంటూ కాలంతో పరిగెత్తారని పేర్కొన్నారు. సాహితీ ప్రయాణంలో ఆయనతో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్‌ హౌస్‌, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులుగా ఆయన నిబద్ధతతో పని చేసిన కార్యకర్త, కావ్యకర్త అని కొనియాడారు. చివరి వరకు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో విస్తృత అధ్యయనం చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి పూడ్చలేని లోటని అన్నారు.

ప్రముఖ రచయిత, కవి నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ ”తంగిరాల వ్యక్తి కాదు.. ఒక సంస్థ. త్యాగరాయ గానసభ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ఆయన లేని సభ లేదు” అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను చివరి వరకు కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన్‌ మాట్లాడుతూ తంగిరాల సంతాప అనడం కన్నా సం..తాప సభ అనడం సముచితమని వ్యాఖ్యానించారు. పెద్దల్లో పెద్దవాడిలా… చిన్నల్లో చిన్న వాడిలా ఆయనది అన్ని వయసుల వారితో కలిసి పోయే అరుదైన వ్యక్తిత్వమని కొనియాడారు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌, ప్రముఖ కవులు, రచయితలు జూలూరి గౌరిశంకర్‌, కూర చిదంబరం, నాళేశ్వరం శంకరం, రఘువీర్‌ ప్రతాప్‌, పొత్తూరి సుబ్బారావు, రమణ, తెలంగాణ సాహితీ సభ్యులు నస్రీన్‌ఖాన్‌, అనంతోజు మోహన కృష్ణ, సలీమా, రేఖ, రాజ్యలక్ష్మి, ఆయన కుమారుడు సాయి సుందర్‌, చెల్లెండ్లు సరస్వతి, గంగ, సాహితీ మిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad