– చైనా జోలికెళ్లేందుకు జంకుతున్న ట్రంప్
– అమెరికా సుంకాలపై నోరెత్తని ‘విశ్వగురు’
– భారత్, చైనాలకు రష్యా నుంచే చమురు దిగుమతులు
– అయినా ఆంక్షల విధింపులో భారీ వ్యత్యాసం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలపై ‘విశ్వగురు’ నోరెత్తట్లేదు. భారత్‌తో పాటు చైనా కూడా రష్యానుంచే చమురు దిగుమతులు చేసుకుంటున్నా, చైనావైపు చూసేందుకు ట్రంప్ సాహసించట్లేదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థతో పాటు అమెరికాతో సుంకాల విధింపుపై ఢ అంటే ఢ అని చైనా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనితో ముందు బెదిరిద్దాం అనుకున్న ట్రంప్…ఆ తర్వాత వెనుకడుగు వేయక తప్పలేదు. అరుదైన భూఖనిజాలు, ఇతర వస్తువుల కోసం అమెరికా చైనా మీదే ఆధారపడుతుండటమే దీనికి కారణం. ఫలితంగా చైనా స్వయంప్రతిపత్తి ముందు ట్రంప్ ఆటలు సాగలేదు. ఇక ట్రంప్‌ను కౌగిలించుకొని, మా బంధం విడదీయలేనిది అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ‘విశ్వగురు’ను అమెరికా అధ్యక్షుడు కూరలో కరివేపాకు మాదిరి తీసేసిన విషయం తెలిసిందే. సామ్రాజ్యవాదానికి తలొగ్గితే, తలవంపులు ఎలా ఉంటాయో ‘విశ్వగురు’ ఉదంతమే ఉదాహరణ.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానంటూ పెద్దరికాన్ని భుజాన వేసుకున్నారు. దానితోపాటే రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల పైనా ఆంక్షలు, సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగారు. ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా చమురు కొంటున్న దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలపై తదుపరి ఆంక్షలు విధించే విషయంలో ట్రంప్ తీరు భిన్నంగా ఉంది. చైనా మీద ఆంక్షలకు వెనుకాడుతున్న ట్రంప్, భారత్‌పై మాత్రం సుంకాల మోత మోగిస్తున్నారు. అమెరికా అరుదైన భూఖనిజాలు, ఇతర వస్తువుల కోసం చైనా మీద ఆధారపడుతోంది. దానివల్లే చైనాపై ట్రంప్ దూకుడు పనిచేయలేదు. ఇక భారత్‌పై అమెరికా రెండు దశల్లో విధించిన సుంకాల మొత్తం 50 శాతానికి పెరిగాయి. వాటిలో మొదటి దఫా విధించిన 25 శాతం టారిఫ్‌లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మిగతా 25 శాతం సుంకాల విధింపు ఈనెలాఖరునాటికి అమల్లోకి రానున్నాయి. ఇంతలోనే అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ అలస్కా వేదికగా జరిగింది. భారత్‌పై విధించబోయే ఆంక్షలు, సుంకాలు ఈ సమావేశ ఫలితం మీదే ఆధారపడిఉంటాయని అమెరికా ముందే హెచ్చరించింది. అయితే ఈ భేటీ తుది ఫలితం ఏంటన్నది అధికారికంగా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ భారత్‌పై ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాల సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.
వాస్తవానికి భారత్ కంటే చైనానే రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు దిగుమతులు చేసుకుంటుంది. చైనా గతేడాది రికార్డు స్థాయిలో 109 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకున్నది. చైనా మొత్తం ఇంధన దిగుమతుల్లో ఇది దాదాపు 20 శాతంగా ఉంది. భారత్ రష్యా నుంచి గతేడాది 88 మిలియన్ టన్నుల చమురును మాత్రమే కొనుగోలు చేసింది.
విశ్వగురువే టార్గెట్…
యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ చైనాపై తదుపరి ఆంక్షలు విధించకపోవటాన్ని సమర్థించారు. అదే సమయంలో భారత్ లాభాపేక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ ఒక శాతం కంటే తక్కువ ఆయిల్‌ను దిగుమతి చేసుకునేదనీ, అది ఇప్పుడు 42 శాతానికి చేరిందని ఆయన వివరణ ఇచ్చారు. రష్యా నుంచి చమురును తక్కువకు కొనుగోలు చేసి, తన మార్కెట్లో దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నదని విశ్లేషించారు. దీనివల్ల భారత్‌లో కొన్ని సంపన్న కుటుంబాలు 16 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించాయని ఆయన వివరించారు. చమురు కొనుగోలు ద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారత్ నిధులు సమకూరుస్తున్నదని ట్రంప్ పరిపాలనా అధికారి, శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
కొత్త సుంకాల చట్టానికి అమెరికా యత్నాలు
రష్యా నుంచి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే దేశాలే టార్గెట్‌గా ‘ది శాంక్షనింగ్ రష్యా యాక్ట్-2025’కి అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యాతో వాణిజ్యం సంబంధాలు ఉన్న దేశాలపై 500 శాతం సుంకాలు విధించటానికి ఈ చట్టం అధికారాన్ని కల్పిస్తుంది. అయితే ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లే విషయంలో ట్రంప్ ఆమోదం కోసం యూఎస్ సెనెటర్లు వేచి చూస్తున్నారు.