– 600 లావాదేవీల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
– సంపద నిర్వహణ కోసమేనంటున్న నిపుణులు
– పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయంటున్న విమర్శకులు
వాషింగ్టన్ : రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్పొరేట్, మున్సిపల్, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కోసం వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దీనికి సంబంధించి ప్రధాన బ్యాంకులు, కంపెనీల్లో 600కు పైగా లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ కార్యాలయం రెండు రోజుల క్రితం ఈ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచింది. జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెట్టారని, వీటికి సంబంధించి 600కు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఎథిక్స్ కార్యాలయం వివరించింది.
పెట్టుబడులు ఎక్కడీ
ప్రతి బాండ్ కొనుగోలు కోసం ఎంత మొత్తం వెచ్చించిందీ ఫైలింగ్‌లో వివరించనప్పటికీ ఎక్కువ విలువ కలిగిన లావాదేవీల జాబితాను వెల్లడించింది. అవన్నీ కార్పొరేట్, మున్సిపల్, ప్రభుత్వ రుణ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించినవే. ప్రముఖ సంస్థలైన సిటీగ్రూప్, మార్గాన్ స్టాన్లే, వెల్స్ ఫార్గో, మెటా, క్వాల్‌కామ్, హోం శాఖ, టి-మొబైల్ యూఎస్‌ఏ, యునైటెడ్ హెల్త్ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రాలు, కౌంటీలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్, ఇతర మున్సిపల్ సంస్థలు జారీ చేసిన బాండ్లను కూడా ట్రంప్ కొనుగోలు చేశారు. వీటిలో చాలా వరకూ ట్రంప్ ప్రభుత్వ విధానాల ద్వారా ప్రయోజనం పొందినవి కావడం గమనార్హం.
పెరిగిన సంపద నిర్వహణ కోసమే…
అయితే పెట్టుబడుల ఎంపిక, నిర్వహణలో ట్రంప్‌కు కానీ, ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి పాత్ర ఉండదని శ్వేతసౌధంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారాలను థర్డ్ పార్టీ ఆర్థిక సంస్థ చూసుకుంటుందని, ఫైలింగ్స్‌ను ఫెడరల్ ఎథిక్స్ అధికారులు సర్టిఫై చేస్తారని చెప్పారు. లావాదేవీలన్నీ చట్టానికి అనుగుణంగానే జరిగాయని అన్నారు. కాగా ట్రంప్ సంపద పెరగడంతో దాని నిర్వహణ కోసం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే బాండ్లు కొనుగోలు చేసి ఉండవచ్చునని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్‌లో అమెరికా వ్యూహకర్తగా పనిచేస్తున్న జాన్ కానవాన్ తెలిపారు. ‘ట్రంప్ నికర ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. ఇందులో ఎక్కువ భాగం క్రిప్టో హోల్డింగ్స్, ట్రంప్ మీడియాలో కేంద్రీకృతమైంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఆయన తన బిలియన్ డాలర్ల ఆస్తులను వేర్వేరు రంగాలలో పెట్టుబడి పెడుతున్నారు. వాటిలో బాండ్ల కొనుగోలు ఒకటి. అంతకంటే మరేమీ లేదు’ అని చెప్పారు.
పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఆందోళన
ట్రంప్ ప్రధానంగా కార్పొరేట్, మున్సిపల్ బాండ్లను, అధిక నాణ్యత, రేటింగ్ కలిగిన ఇతర బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు కన్పిస్తోందని కానవాన్ వివరించారు. దీనివల్ల పెద్దగా రిస్క్ ఉండదని చెప్పారు. వ్యాపార ఆస్తులను తన పిల్లలు నిర్వహించే ట్రస్ట్‌లో ఉంచుతానని ట్రంప్ చెబుతున్నప్పటికీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు చేకూరే అవకాశాలపై విమర్శకులు ఆందోళనలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. వివిధ వనరుల ద్వారా తనకు వస్తున్న ఆదాయం ఇప్పటికీ వ్యక్తిగతంగా తనకు చేరుతూనే ఉన్నదని జూన్‌లో దాఖలు చేసిన వార్షిక నివేదికలో ట్రంప్ వెల్లడించారు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలే కారణం
2024 క్యాలండర్ సంవత్సరంలో క్రిప్టో కరెన్సీలు, గోల్ఫ్ ఆస్తులు, లైసెన్సింగ్ ఒప్పందాలు, ఇతర వెంచర్ల ద్వారా ట్రంప్‌నకు 600 మిలియన్లకు పైగా ఆదాయం సమకూరిందని ఫైలింగ్ చెబుతోంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీల కారణంగా ట్రంప్ సంపద గణనీయంగా పెరిగింది. రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ 1.6 మిలియన్ డాలర్లకు తక్కువేమీ ఉండదు.
బాండ్ల కొనుగోలులో ట్రంప్ బిజీ బిజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES