– జనజీవన స్రవంతిలో కలవండి
– మావోయిస్టులకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మావోయిస్టు దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు కాకర్ల సునీత అలియాస్ బద్రి అలియాస్ లక్ష్మి అలియాస్ సరోజా, స్టేట్ కమిటీ మెంబర్ చెన్నూరి హరీష్ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఎదుట లొంగిపోయారు. వీరు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, దళసభ్యుల నుంచి కేంద్ర కమిటీ వరకు ఎదిగి, రెండు నెలల కిందట ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్నారు. గురువారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో సీపీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. కాకర్ల సునీత అలియాస్ బద్రి 1985లో రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) పట్ల ఆకర్షితురాలైంది. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయితల సంఘంలో ముఖ్యమైన నాయకుడు. వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారులు తరచుగా వారి ఇంటికి వచ్చేవారు. సునీత 1986లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాకర్ల సునీతకు టీఎల్‌ఎన్ చలం అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్‌తో 1986లో వివాహం అయింది. అనంతరం ఆమె మావోయిస్టు పార్టీలో కీలకంగా.. వివిధ ప్రాంతాలు, హౌదాల్లో భర్తతో కలిసి పనిచేసింది. వలిగొండ, భైరవకోన, పూజారిగూడ, కుట్ ఎన్‌కౌంటర్లలో పాల్గొంది. ఆమె భర్త చలం 2005లో మావోయిస్టులతో ప్రభుత్వం జరిపిన చర్చలో పాల్గొన్నారు. జూన్ 5, 2025లో అన్నపురం నేషనల్ పార్కు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలం మృతిచెందాడు. సునీత తప్పించుకుంది. జనజీవన స్రవంతిలో కలిసిన సునీతకు గతంలో ఆమెపై ఉన్న రూ.20లక్షల రివార్డును సీపీ అందజేశారు.
రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి హరీష్..
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి హరీష్ అలియాస్ రామన్న, శ్రీను ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2006లో ఏటూరునాగారంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్నప్పుడు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుయ్యాడు. నవంబర్ 2018లో సీపీఐ(మావోయిస్ట్)లో చేరడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో భద్రాచలంలో అరెస్టై నెల రోజులు వరంగల్ జైల్లో ఉన్నాడు. జైల్లో టీపీఎఫ్ చెందిన మంచు రమేష్‌తో పరిచయం ఏర్పడింది. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత మంచు రమేష్ పిలుపు మేరకు అతను టీపీఎఫ్ కార్యాలయంలో పనిచేశాడు. వివిధ హౌదాల్లో పనిచేసిన హరీష్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని టెకమెట్టా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు. ఈ ఏడాది జూన్ 7న నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఇర్పగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ‘టీఎస్‌సీఏం’ భాస్కర్ మరో ముగ్గురు మృతిచెందగా హరిష్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో జనజీవన స్రవంతిలోకి రావాలన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు లొంగిపోయాడు. ఇతనిపై ఉన్న రూ.4లక్షల రివార్డును సీపీ అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్యగౌడ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఆయుధాలు వీడండి.. : సీపీ
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరాలని సీపీ సుధీర్‌బాబు మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సునీత సోదరి మాధవి కూడా పదేండ్ల నుంచి అజ్ఞాతంలో ఉందని, ఆమె కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 387మంది జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు.
మావోయిస్టు సీనియర్ సభ్యుల లొంగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES