– రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
– సంక్షేమ భవన్‌ను ముట్టడించిన విద్యార్థులు
నవతెలంగాణ – మెహదీపట్నం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ బీసీ నాయకులు వేముల రామకృష్ణ నాయకత్వంలో విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వివిధ స్కీముల కోసం వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలకు మరో రూ.6000 కోట్లు అప్పు చేస్తే పోయేదేమున్నదని ప్రశ్నించారు. స్కాలర్‌షిప్ బకాయిల కోసం బడ్జెట్‌లో రూ.5000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయకుండా ఉద్దేశపూర్వకంగా లాప్స్ చేసిందని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఏపీలో స్కాలర్‌షిప్ బకాయిల నిమిత్తం రెండు దఫాలుగా రూ.1500 కోట్లు విడుదల చేశారని, మన రాష్ట్రంలో పైసా కూడా విడుదల చేయకుండా బీసీ విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించి వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజుబకాయిలు ఇవ్వడానికి మనసు రావడం లేదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఫీజుబకాయిలు చెల్లించాలని, లేకపోతే మహా ఉద్యమం చేపట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీలా వెంకటేష్, నందగోపాల్, ప్రీతం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ విద్యార్థులకు పైసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES