నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ (25) ఎయిర్ ఫోర్స్ జవాన్ అంత్యక్రియలు అధికారికం లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. వివరాల్లోకెళ్తే …. లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ ఎయిర్ ఫోర్స్ న్యూఢిల్లీలో పనిచేస్తుండేవాడు. గత మూడు రోజుల క్రితం వరుస సెలవుల రావటంతో ఆగ్రా దగ్గరలో ఉన్న దమ్మ వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. అయితే మృతదేహం స్వగ్రామమైన తరోడ కు శనివారం ఉదయం చేరుకుంది. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ చౌహన్ ఆధ్వర్యంలో మృతదేహం పై ముందుగాఎయిర్ ఫోర్స్ జవాన్లు త్రివర్ణ పథకాన్ని శవపేటిక పై కప్పి , పుష్పగుచ్చం వేసి నివాళులర్పించారు.
ఆనంతరం ప్రత్యేక రధంపై మృతదేహం ఉంచి శవయాత్ర కొనసాగింది. చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు ,బంధువులు, గ్రామస్తులు, ఆయా గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్మశాన వాటికలో మృతదేహం చితిపై పెట్టి ఎయిర్ ఫోర్స్ జవాన్లు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో ముగించారు. ఆనంతరం చితికి మృతుడి తండ్రి నిప్పంటించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు ,బంధువులు, రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్, తదితరులు పాల్గొన్నారు.
