పంచాయతీల నిర్వహణ భారం తడిసి మోపెడు
ఏడాదిన్నరగా అప్పులు చేస్తున్న కార్యదర్శులు
స్థానిక ఎన్నికలే సమస్యకు పరిష్కారమని భావన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో పంచాయతీ కార్యదర్శులకు విచిత్ర పరిస్థితి నెలకొంది. పంచాయతీల నిర్వహణ భారం తడిసి మోపవడం.. ప్రభుత్వం పట్టిం చుకోకపోవడంతో ఏమి చేయాలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తమారైంది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనని వారు భావిస్తున్నారు.దీంతో ఈ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల పాలక వర్గాలు కొలు వుదీరితే..ఆర్థిక పరమైనా సమస్యల నుంచి బయటపడే అవకాశం లేకపోలేదని వారు భావిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీ కార్యర్శులే అప్పులు చేసి చెత్త సేకరించే వాహనాల్లో డీజిల్ పోస్తున్నారు.
అధికారికంగా ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు అవసరమైన నిర్వహణ పూర్తిగా కార్యదర్శులే చూసుకోవాల్సిన పస్థితి నెలకొంది. గడిచిన 18 నెలల నుంచి ఒక్కో కార్యదర్శి రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అప్పులు చేసి డీజిల్ కొనుగోళ్లు, విద్యుత్ బల్బుల నిర్వహణ, పల్లెల్లో నల్లా పైపులైన్లు పగిలినా, మోటర్లు కాలినా వాటి మరమ్మతులను చేసేందుకు సొంతంగా డబ్బులు వెచ్చిస్తూ అప్పులపాలవుతున్నారు.
పోరాటాలకు సిద్ధమైనా కార్యదర్శులు..
ఆర్థిక పరమైనా పనులు నిర్వహించలేమని, చెత్త ట్రాక్టర్లలో డీజిల్ పోయటం తమతో కాదని కార్యదర్శులు వాటి తాళాలను సైతం అధికారులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు జూన్ మాసంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు.15 అంశాలతో కూడిన వినతి పత్రాలను ఎంపిడిఓ, కలెక్టర్ లకు,ఇతర ప్రజాప్రతినిధులకు అందించారు.పోరాటం చేసేందుకు రాష్ట్ర, జిల్లా,మండల స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీని (జేఏసీ) సైతం ఏర్పాటు చేశారు. జూన్ 15 రోజుల పాటు పలు డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పోరాటానికి సన్నద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావటంతో వెనుకడుగు వేశారు.
పాలక పక్షం లేక నిధులు రాక..
18 నెలల పాటు పాలకపక్షం లేక పోవటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల నిర్వహణ గాలికొదిలేశాయి. 2024 జూలైలో కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి సుమారు రూ.10 వేల చొప్పున విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో స్వచ్ఛదనం.. పచ్చదనం కింద ఒక్కో పంచాయతీకి రూ.50 వేల చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.