నవతెలంగాణ – ఉప్పునుంతల
జిల్లాలో ఎరువుల పంపిణీపై ఎలాంటి లోపాలు సహించబోమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా యూరియా స్టాక్, విక్రయ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు ఎకరాల వారీగా ఎరువులు పొందుతున్నారా అన్నది చెక్ చేసి, ఎవరికీ ఎక్కువ సేపు వెయిటింగ్ లేకుండా అమ్మకాలు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. “రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడితే నేల దెబ్బతింటుంది, దిగుబడులు తగ్గుతాయి. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకే మోతాదులో వాడాలి” అని సూచించారు. జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు తమ పంటలకు అవసరమైన మేరకే యూరియాను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ తో పాటు ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.