Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఓట్‌ చోర్‌ టు సీట్‌ చోర్‌ నిరంకుశ బిల్లు

ఓట్‌ చోర్‌ టు సీట్‌ చోర్‌ నిరంకుశ బిల్లు

- Advertisement -

మోడీ పాలనలో ప్రతిపక్షాలపై కేంద్రం నిర్విరామంగా ప్రయోగిస్తున్న నిరంకుశ త్రిశూల వ్యూహం ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ రూపం తీసుకోవడం అప్రకటిత అత్యవసర పరిస్థితికి పరాకాష్ట. ఇప్పటివరకూ హక్కులపై దాడిగా, మతపరమైన రాజ్యభావజాలంగా, రాజకీయ కక్ష వ్యూహంగా నడుస్తున్న నిరంకుశత్వం ఇక నిబంధనగా మార్చనుండటమే ఇందులో దాగిన అతిపెద్ద ప్రమాదం. అది కూడా నేరుగా ప్రభుత్వాధినేతలపైనే. మరోవిధంగా చెప్పాలంటే ప్రజల తీర్పు పొందిన నేతలు, పార్టీలపైనే. పార్లమెంటులో హడావుడిగా ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన మూడు బిల్లులు సరైన దిశలో వున్నా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు సూచించారు. ఈ బిల్లుల్లో అస్పష్టమైన భాగాలున్నాయని సూచనగా చెప్పారు.అయితే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల మేరకు హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన ఏ బిల్లును కూడా సాంకేతిక సమస్యలు వస్తే తప్ప సర్కారు సవరించుకున్న దాఖలాలు లేవని ఆయనకు బాగా తెలుసు. ఎన్డీయేకు అతి పెద్ద మద్దతుదారు ఒక విధంగా ఈ ప్రభుత్వ మనుగడకు కీలకాధారమైన రాజకీయ శక్తి టీడీపీకే ఆ సందేహం రావడం కన్నా దానిపై వ్యాఖ్యానం మరేముంటుంది? తర్వాతి మద్దతుదారైన నితీశ్‌ కుమార్‌ పాలనలోని బీహార్‌లోనైతే ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌ ఇది ఆయన మెడపై కత్తిలా తెచ్చిన బిల్లేనని రోజూ దెప్పిపొడుస్తున్నారు. భాగస్వాముల భయాలు అలా వుంచి దేశంలోని రాజకీయ పార్టీలూ, విమర్శనాత్మక మీడియా, న్యాయకోవిదులూ ప్రతిఒక్కరూ వేరు వేరు కోణాల్లో ఈ తాజా బిల్లులపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చడానికి కారణమదే.

పోలీసు,జడ్జి,తలారి
అయిదేండ్లకు మించి శిక్షపడే అవకాశమున్న ఆరోపణపై అరెస్టయి 30రోజులకు మించి జైలులో ఉంటే ప్రధానమంత్రి, కేంద్రమంత్రులూ, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులూ ఎవరైనా 31వ రోజున పదవి కోల్పోతారు. అదే ఈ బిల్లు సారాంశం. పోలీసులు ఎవరి ఫిర్యాదుపైన లేదా తమకే ఆధారాలు దొరికాయనే పేరిట, ఆదేశాలు అందాయి గనక ఎవరినైనా అరెస్టు చేసి నెలరోజుల పాటు వారికి బెయిలు రాకుండా చూస్తే చాలు వారి పదవి పోయినట్టేనన్నమాట. ఆరోపణ కోర్టులో నిరూపణ జరిగే వరకూ ఆగనక్కరలేదన్నమాట. ఆరోపణల నిర్ధారణ కోర్టుల్లో జరగాలనీ, సుప్రీంకోర్టుదాకా వెళ్లవచ్చుననీ ఇకపైన చెప్పడానికి ఉండదు. రాజ్యాంగ పరంగా నేరారోపణల్లో అంతిమాధికారం కోర్టులది తప్ప కార్యనిర్వాహక వర్గానిది కాదు.ఈ ఒక్కబిల్లుతో కేంద్రం సర్వాధికారం చేతుల్లోకి తీసేసుకుంటుంది. ఇటీవలే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవారు మాట్లాడుతూ కార్యనిర్వాహకవర్గం లేదా పాలకవ్యవస్థనే పోలీసు జడ్జి తలారిగా (న్యాయమూర్తిగా, న్యాయవ్యవస్థగా అమలుకర్తగా) ఉంటానంటే చెల్లుబాటు కాదని ప్రకటించారు. కానీ ఈ మూడు బిల్లులు కచ్చితంగా అవే. చట్టం ముందు అందరూ సమానమేననీ, ఎవరైనా సుప్రీంకోర్టు దాకా వెళ్లవచ్చునని చెప్పే సూక్తులు ఒక్కదెబ్బతో తారుమారైపోతాయి.ప్రజల్లో లోతుగా పునాదులూనుకుని ఏండ్ల తరబడి పనిచేసి అధికారానికి వచ్చిన అధినేతలనైనా ఈ మాయాజాలంతో మాజీలను చేసేయొచ్చు.

గురుశిష్యుల గతమేంటి?
గడుసు మాటలకూ, ద్వంద్వ రాజకీయాలకూ మారుపేరైన మోడీ,షాలు దురుద్దేశముంటే నేరుగా ప్రధానిని ఈ బిల్లు పరిధిలో ఎందుకు చేరుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.మొదట ఈ ముసాయిదాలో ప్రధాని పదవి లేకపోతే స్వయంగా మోడీనే కలపాలని చెప్పారని ఆయన గొప్పతనం కీర్తిస్తున్నారు. కానీ, ప్రధాని వరకూ ఎందుకు ఒక్క బీజేపీ నేతను కూడా ఇంతవరకూ ఆరోపణతో అరెస్టు చేయడం గానీ, తొలగించడం గానీ జరగలేదు. స్వయంగా మోడీ గుజరాత్‌ మారణహోమం సందర్భంలో వ్యక్తిగతంగానూ, ప్రభుత్వాధినేతగానూ తీవ్రారోపణలు ఎదుర్కొన్నా అర నిమిషమైనా అధికారం వీడింది లేదు.అప్పట్లో హోంశాఖ చూస్తూ తీవ్ర నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్‌షా సంగతి చెబితే పదవికి రాజీనామా చేశానని దబాయిస్తున్నారు. వాటిలో దాగి ఉన్న మతలబేంటో తర్వాత ఆయనకు, బీజేపీ వ్యవస్థలోనూ, దేశ పరిపాలనలోనూ రెండవ స్థానం అప్పగించడంలోనే తెలిసిపోతుంది. మోడీతో రాజీనామా చేయించాలని, రాజధర్మమని ధర్మపన్నాలు పలికిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి చేసింది లేకపోగా తర్వాత ఏకంగా తమ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రమోషన్‌ పొందారు. రథయాత్రతో మత రాజకీయాలు రగిలించిన మోడీ అసలు గురువు అద్వానీ జైలులో ఉండటమే గాక సిబిఐ విచారణ ఎంతకాలం ఎదుర్కొన్నా ఏకంగా ఉపప్రధాని కాగలిగారు. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్టు ఈ బిల్లు తెచ్చి ధర్మరక్షణ అంటున్నారు!

సీఎంపై వేటుకు ఎస్‌ఐ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నాలుగు నెలలు జైలుపాలైనా రాజీనామా చేయకుండా ఉండటం వల్లనే తాము ఈ బిల్లు తేవాల్సి వచ్చిందని ధర్మభంగిమ దాలుస్తున్నారు. మరి లిక్కర్‌ స్కామ్‌ విచారణను సాగదీస్తూ కచ్చితంగా ఎన్నికల సమయానికి ముందే ఆయన్ను అరెస్టు చేసి జైలులో పెట్టడం రాజకీయం కాదా? సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఎన్ని సందేహాలు లేవనెత్తినా బేఖాతరు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అటూ ఇటూ తిప్పి కొనసాగించింది కేంద్రం కాదా? రాజ్యాంగం ఒప్పుకోకపోతే ఆయన కొనసాగ గలిగేవారా? బయటకు వస్తూనే రాజీనామా చేయలేదా? కోర్టులో ఆయనపై నేరం రుజువైతే ఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినా కూడా దిగిపోవలసివచ్చేదే కదా? మరి దాన్ని సాకుగా చూపించడం ఎలా పొసుగుతుంది? తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు పార్థాచటర్జీ,జ్యోతి ప్రియలు, తమిళనాడులో సెంథిల్‌ బాలాజీ కూడా ఆరోపణల తర్వాత కొనసాగారని ఉదహరిస్తున్నారు. నిజం చెప్పాలంటే ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’ సూత్రంతో తృణమూల్‌ ఆరోపిత నేతలను చేర్చుకున్నది బీజేపీనే. ఇక సెంథిల్‌ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నిజంగా జరగాల్సింది అది తప్ప తమతో వస్తే మాఫీ లేకపోతే సఫా అన్నట్టు చేయడం ఏం ప్రజాస్వామ్యం? ఒక క్లర్క్‌ లేదా ప్యూన్‌ ఆరోపణలతో అరెస్టయితే యాభై గంటల్లో ఉద్యోగం కోల్పోతారనీ, అలాంటప్పుడు నెలరోజులు జైలులో ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎలా అర్హులవుతారని బీహార్‌ సభలో స్వయంగా మోడీనే వ్యాఖ్యానించారు.నిజానికి ఉద్యోగులను కూడా ఉన్నఫలాన తీసేయడానికి చట్టాలు ఒప్పుకోవు. చాలా తతంగం ఉంటుంది. వారికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకూ అసలు పోలికేమిటి? అరెస్టు కావడం వేరు, అరెస్టు చేయించబడటం వేరు. బీజేపీ హయాంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులనే టార్గెట్‌ చేసుకున్న తర్వాత ఏదో ఒక సాకుతో, వంకతో అరెస్టు చేయించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమస్యే కాదు. ఒక ఎస్‌ఐ స్థాయి పోలీసు ముఖ్యమంత్రి భవిష్యత్తుతో అంటే రాష్ట్ర ప్రభుత్వ మనుగడతో చెలగాటమాడతారన్న మాట. కోర్టులలో అప్పీలు చేసుకోవడం వాయిదాల మధ్య నెలరోజులు ఇట్టే గడిపేయడం,31వ రోజున మీరు పదవి కోల్పోయారని ప్రకటించడం ఏం ప్రజాస్వామ్యం? సైనిక ముఠాల నీడలో ప్రభుత్వాలు నడిచే దేశాల్లో తమకు నచ్చనివారిపై ఆరోపణల మీద అరెస్టు చేయడం, ఏదో అవగాహనకు వచ్చి మరొకరిని గద్దెక్కించడం నిరతం చూస్తుంటాం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ అలాంటి పిల్లవ్యవహారాలు నడిపించడాన్ని అనుమతించుదామా?

అన్ని వ్యవస్థలకూ చేటు
ప్రతిపక్షాలపై దాడి మాత్రమే గాక రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి, ప్రధాని,ముఖ్యమంత్రి వంటివారి హక్కులను కూడా ఈ బిల్లు హరించి వేస్తుంది. రాజ్యాంగం 75(1)వ అధికరణం రాష్ట్రపతి ప్రధాని సలహాపై మంత్రివర్గ ఏర్పాటు, మంత్రుల బాధ్యతలపై ప్రధాని నిర్ణయం వంటి అంశాలు పేర్కొనబడ్డాయి. కాని 130వ సవరణ కింద అవన్నీ వృథాగా మారతాయి. ఎందుకైనా సరే ఒక ఎస్‌ఐ ఒక మంత్రిని అరెస్టు చేస్తే – ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలైతే చాలు- ఆయన లేక ఆమె 31వ రోజున బయటకు రాలేకపోతే పదవి కోల్పోయినట్టే. ఇక ప్రధాని పాత్ర, రాష్ట్రపతి పాత్ర ఏంకావాలి? రాష్ట్రపతికి కూడా విచక్షణాధికారం లేదన్న మాటే. ఇదే రాష్ట్రాల స్థాయికి వస్తే ముఖ్యమంత్రిని, మంత్రులను గవర్నర్‌ తొలగించవచ్చునని బిల్లు పేర్కొంటున్నది. మోడీ గద్దెనెక్కాక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలనే లక్ష్యంగా చేసుకుని ఎలా వెంటాడారో, ఫిరాయింపులను ప్రోత్సహించారో చూస్తూనే ఉన్నాం. గవర్నర్ల ద్వారా సాగించే కుట్రలూ చూశాం. ఈ విషయమై శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ల ఎడతెగని జాప్యానికి తెరదించుతూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే(అది కూడా హోంశాఖ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ అంశాలకు అనుగుణంగా) కేంద్రం రాష్ట్రపతి ప్రస్తానవ పేరుతో దానికీ అడ్డు తగులుతున్నది.మీరు ఇలాంటి ఆదేశాలు జారీ చేయవచ్చునా అని ప్రశ్న లేవనెత్తి ఆపని తప్పని తన అభిప్రాయంగా అందజేసింది.ఈ వరసలో చూసినప్పుడు తాజా బిల్లులో కుత్సితం దానికదే తెలిసిపోతుంది. ప్రధానిని నామకార్థంగా ఈ పరిధిలో చేర్చినా ఎలాగూ ఆయన్ను అంటుకోవడం జరగదు.ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో భాగస్వామ్య పక్షాల మంత్రులు, బీజేపీలో కూడా తనకు నచ్చని వారు టార్గెట్‌ అవుతారన్నమాట. స్పష్టంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన మరుక్షణం ఆ ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మరొకరిని ఎన్నుకోవడానికి పట్టే సమయంలో గవర్నర్ల రాజ్యం నడుస్తుంది.లేదా వారే లొంగిపోయేవారైతే కూటమిలో చేర్చుకోవ డమే. పోలీసులు దర్యాప్తు సంస్థలను కూడా ఇది తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది.పైగా వ్యవస్థల మధ్య సంబంధాలను తారుమారు చేసేస్తుంది. సీనియర్‌ న్యాయవాది అమన్‌లేఖి బిల్లుపై స్పందిస్తూ ఇది న్యాయపరంగానూ, వ్యవస్థాగతంగానూ పెద్దతప్పుగా ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి కొందరు నిపుణులు వంతపాడుతున్నారు గానీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌,హిందూస్థాన్‌ టైమ్స్‌,ట్రిబ్యూన్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందూ వంటి ప్రముఖ పత్రికలన్నీ సునిశితంగానే తప్పుపట్టాయి. ప్రస్తుతానికి బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపాము గనక అక్కడ అభిప్రాయాలు తెలపవచ్చని అమిత్‌షా చెప్పవచ్చుగానీ అక్కడ నిజంగా దాన్ని బుల్డోజర్‌ చేయడమే జరుగుతుందనేది గతంలో చాలాసార్లు చూశాం. కాకపోతే పార్లమెంటులో బలాబలాల రీత్యా (292-366) ఈ బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదని లోక్‌సభ మాజీ కార్యదర్శి పిడిటి ఆచార్య అంటున్నారు.ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు బిల్లు తేవడానికి అదీ ఒక కారణమై ఉండొచ్చు. ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ పేరిట 65 లక్షల ఓట్లు తొలగించిన బీహార్‌లో మోడీ దీనిగురించి మాట్లాడటం కూడా వ్యూహాత్మకమే. పహెల్గాం ఉగ్రదాడి పైనా ఆయన అక్కడే మాట్లాడారు.అటు ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఇటు బీహార్‌ ఎన్నికలు బీజేపీ తక్షణ ప్రాధాన్యతలైలే తస్మదీయుల తలనొప్పి లేకుండా చేసుకోవడం దీర్ఘకాలిక లక్ష్యం. ఓట్‌ చోర్‌ విఫలమైతే సీట్‌ చోర్‌ అన్నమాట. వీటన్నిటికీ మూలం మోడీ సర్కారును ఆవరించిన అభద్రతే. ఈ కుట్రలూ కూహకాలను తిప్పికొట్టకపోతే ప్రజల తీర్పు,చట్టబద్ద పాలన అన్న మాటలకే అర్థం ఉండదు.

– తెలకపల్లి రవి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad