నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా ప్రారంభించనున్నారు.
టాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి “ తెలంగాణ విద్య రంగంలో రావాల్సిన మార్పులు ప్రభుత్వ ప్రణాళిక” అనే విషయం మీద ప్రసంగించనున్నారు. ఇరవై ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించ బోతున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి. “సీఎం రీసెర్చ్ ఫెలో షిప్ “ తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్టళ్లలో 7223 మంది విద్యార్థులకు వసతి ఉండగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వసతిని సమకూర్చనున్నాయి.