Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeమహబూబ్ నగర్నూతన విద్యావిధానంపై పోరాడాలి

నూతన విద్యావిధానంపై పోరాడాలి

- Advertisement -

– ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య
– పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌

నవ తెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కొల్లాపూర్‌ రూరల్‌
నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య అన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ డివిజన్‌ కేంద్రంలోని సింగోటంలో రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చాక విద్యారంగంపై దాడి మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానంతో మూఢనమ్మకాల పెంపు.. ప్రయివేట్‌, కార్పొరేట్‌ రంగాలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. నూతన విద్యావిధానం-2020 తీసుకొచ్చి విద్యలో మతతత్వ విధానాలను జొప్పిస్తోందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్‌సింగ్‌ చరిత్రను తొలగిస్తూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని సావర్కర్‌లాంటి వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో పొందుపరచడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయమైన పాఠ్యాంశాలను తొలగిస్తూ, అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను చేర్చుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. అదేవిధంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో యూజీసీ నిబంధనలో మార్పులు చేశారన్నారు. దానిలో కొన్ని మార్పులు చేయాలని ఎన్నిసార్లు మేధావులు సూచనలు చేసినా బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు తగ్గిస్తూ.. బోధన బోధనేతర సిబ్బందిని నియమించకుండా.. క్రమంగా డిపార్ట్‌మెంట్స్‌ను మూసేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యారంగాన్ని కాపాడుకునేందుకు నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్‌, నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, పూజ, ప్రశాంత్‌, శంకర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీకాంత్‌, ప్రశాంత్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్‌, తారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad