Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భువనగిరి జిల్లాలో పంటల పరిస్థితి-విశ్లేషణ- ప్రణాళిక

భువనగిరి జిల్లాలో పంటల పరిస్థితి-విశ్లేషణ- ప్రణాళిక

- Advertisement -

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయకర్త…డాక్టర్ డి శ్రీలత…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుత వానాకాలం  వర్షపాతం మరియు పంటల సాగు పరిస్థితులను గమనించినట్లయితే జూన్ నుండి ఆగస్టు 20 వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే( 338.8 మీ.మీ) అసలు వర్షపాతం (567.4 మీ.మీ)  సుమారు 75%  అధిక వర్షపాతం నమోదైనది. ఈ నేపథ్యంలో పంటల సాగు  విస్తీర్ణం ఈ క్రింది విధంగా ఉంది. భువనగిరి జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా…పంటలు విస్తీర్ణం ఎకరాలలో సాధారణ పంట సాగుగాను అసలు సాగు చేసిన విషయం వివరాలు ఇలా ఉన్నాయి.  

వరి  275339  సాగు చేయాల్సి  ఉండగా  245462 సాగు చేశారు. ప్రత్తి  127353 ఉండగా  109183 ప్రస్తుత సంవత్సరం తగ్గింది. జొన్న679 గాను  50  మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న 101 గాను 32, కంది పంట 17506 గాను   3764, పెసర  286 గాను 182 సాగు చేసినట్లు తెలిపారు. మొత్తం పంటలు 425563  సాగు చేయాల్సి ఉండగా  361715 మాత్రమే సాగు చేశారు. 

వివిధ పంటల సాగు విస్తీర్ణం బట్టి, జిల్లాలో వరి పంటలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 10-34% తరుగుదల, పత్తిలో 14-25% తరుగుదల, అత్యధికంగా  జొన్న, కంది, మొక్కజొన్న పంటలలో వరుసగా 92 %, 97 % 68% తరుగుదల నమోదయినది. పెసర పంట  నీటి వసతి ఉన్నా కూడ 36% తక్కువగా సాగయినది. ఈ సందర్భంలో,  రైతు సోదరులు అధిక వర్షాల వలన వేసిన పంటలు నష్టపోవడం వలనగాని, సకాలంలో వానాకాలం పంటలను వేయలేకపోయినగాని,  సెప్టెంబర్ 15 వ తేదీ నుండి అనగా ముందస్తు యాసంగి పంటలుగా ఈ దిగువ తెలిపిన పంటలను వేసుకోవడానికి అనువుగా ఉంటుందనారు. 

మొక్కజోన్న… మొక్కజొన్న సెప్టెంబర్ 15 తర్వాత  మధ్యకాలిక ( 100-105 రోజులు) లేక (100-120 రోజుల) రకాలను వేసుకోవచ్చు. ఈ రకాలు సుమారుగా డిసెంబర్ 3వ వారం నుండి జనవరి మొదటి వారంలో కోతకు వస్తాయి. తద్వారా జనవరిలో వేసవి కాలానికి అనువైన నువ్వులు, పెసర లాంటి పంటలను వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మొక్కజొన్నను గింజ పంట గానే కాకుండా పచ్చి బుట్టల కొరకు వేసుకున్నట్లయితే ఇంకా తొందరగా అంటే 85-90 రోజులలో కోతకు వస్తాయి. డి.హెచ్.ఎం 117, 121, 182, 206 (మధ్యకాలిక) డి.హెచ్.ఎం 113 (దీర్ఘకాలిక) రకాలు, అలాగే ధ్రువీకరించిన మార్కెట్ లో లభ్యమయ్యే హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చనారు. 

జొన్న…

జొన్న పంటను యాసంగిలో సాధారణంగా అక్టోబర్ 30 లోపు విత్తుకోవాలి లేనిచో పంట చివరి దశలో బెట్టకు గురై మొవ్వునాశించు   ఈగ కూడా తీవ్రంగా ఆశించడం వల్ల పంట దిగుబడులు తగ్గుతాయి. జొన్న పంటను  జిల్లాలో మాఘీ జొన్నగా కొంత విస్తీర్ణంలో సెప్టెంబర్ రెండవ వారంలోపు విత్తుకోవచ్చు. జొన్నలో రకాలు, హైబ్రిడ్ విత్తనోత్పత్తిని, 4:2 (ఆడ:మగ) నిష్పత్తిలో కూడా చేపట్టవచ్చునారు. 

కంది…

కంది పంటను సెప్టెంబర్ 15 నుండి అక్టోబరు 15 వరకు వేసుకోవచ్చు. కందిలో 120-130 రోజుల కాల పరిమితి కలిగిన డబ్ల్యు.ఆర్.జి 53, పీ.ఆర్.జి 158, యం.ఆర్.జి 1004, డబ్ల్యు. ఆర్.జి 53, ఆర్.జి.టి 1 (తాండూర్ తెల్ల కంది),  డబ్ల్యు.ఆర్.జి 65 (రుద్రేశ్వర),  హనుమ (టి.డి.ఆర్.జి.4) రకాలను సాగు చేసుకోవచ్చు.

పెసర, మినుములు…

 పెసర, మినుము పంటలు కూడా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 30 వరకు వేసుకోవడానికి అనువుగా ఉంటాయి. పెసరలో యం.జి.జి 295, డబ్ల్యు.జి. జి 37(ఏకశిల), టి.ఎమ్- 96-2,  యం.జి.జి 348 (భద్రాద్రి), యం.జి.జి 347(మధిర పెసర), యం.జి.జి 351 (శ్రీరామ) మరియు డబ్ల్యు.జి.జి 42 (యాదాద్రి) మొదలగు రకాలు సుమారు 60-70 రోజులలో పంట కాలo  పూర్తి చేసుకుని సుమారు 4-6 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి.

అలాగే మినుములో, ఎల్. బి.జి 752, ఎల్.బి.జి 20(తేజ), ఎల్.బి.జి 623(లాం 623), డబ్ల్యు.బి.జి 26(వరంగల్ 26), యం .బి.జి 207(మధిర మినుము – 207), ఎల్.బి.జి 787, పి.యు 31 మొదలగు రకాలు సుమారు 70-80 రోజుల్లో  కోతకు వచ్చి 6-8 క్వింటాళ్ల దిగుబడినిస్తాయని తెలిపారు.

శనగ పంట…. నల్లరేగడి, మద్యస్థ నల్ల భూముల్లో  అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు శనగ పంటను  వేసుకోవచ్చు. దేశవాళి  రకాలైన క్రాంతి (ఐ.సి.సి.వి-37), నంద్యాల శనగ-1(ఎన్.బి.ఇ.జి-3), నంద్యాల శనగ- 47, జె.జి-130 మొదలగు రకాలు సుమారు 95-105 రోజులలో కోతకు వచ్చి ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. కాబూలీ రకాలైతే కె.వి.కె -2, పూలే.జి-95311,  శ్వేత (ఐ.సి.సి.వి -2) మొదలగు రకాలు సుమారు 85-100 రోజులలో కోతకు వచ్చి 7-10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి.

ఉలవలు

సాధారణంగా ఆలస్యపు వానాకాలం లేదా ముందస్తు యాసంగికి అనువైన పంట ఉలవలు. ఆగస్టు 15 నుండి అక్టోబరు 15 వరకు విత్తుకోవచ్చు. సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారం చేసుకుని కొంతమేర బెట్టను తట్టుకొని సుమారు 90-100 రోజులలో కోతకు వచ్చి ఎకరానికి 2.5- 4.0 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఉలవలలో పి.డి.ఎం-1, పి.జెడ్.ఎం-1, పి.హెచ్.జి- 62, పి.హెచ్.జి- 9 మరియు సి.ఆర్.హెచ్.జి 19 మొదలగు రకాలు అనువైనవి.

అలసంద (బొబ్బర్లు): అలసంద వర్షాకాలంలో ఆలస్యంగా సెప్టెంబర్ లో విత్తుకోవడానికి అనువైన కూరగాయ లేక విత్తనం లేక పశుగ్రాసపు పంట. కో-4,  సి-152, సి-240 మరియు  జి.సి.-3 మొదలగు రకాలు సుమారు 95-100 రోజుల పంటకాలం కలిగి 3-6  క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. కో-4, సి- 240 రకాలు పశుగ్రాసపు పంటకు కూడా అనుకూలం.

వేరుశనగ: ఈ పంటను సాధారణంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ మొదటి పక్షం నుండి నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. కదిరి-6, కదిరి-9,  కదిరి హరితాంద్ర,  ధరణి , టి.ఎ.జి- 24,  ఐ.సి.జి.వి- 91114, కదిరి 7,8 రకాలు సుమారు 100-105 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి.

కావున రైతు సోదరులు పైన తెలిపిన పంటలను సాగు చేసినట్లయితే, మంచి దిగుబడులు సాధించడమే కాక, ముందస్తు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా,ఆరుతడి పంటల వల్ల, ఆశించిన మార్కెట్ ధర పొందడానికి, భూసారం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad