నవతెలంగాణ హైదరాబాద్: పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రవీంధ్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. సీఎం హాజరయ్యారు.
మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చారు. రెండో తరంలో జైపాల్‌రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారు. జైపాల్‌రెడ్డి దక్షిణ భారత్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన యంగెస్ట్ ఎంపీ అని గుర్తుచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి గుర్తింపు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాం. ప్రజలకు సురవరం సుధాకర్‌రెడ్డి ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజకీయం అంటేనే అధికారం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉంటాం కానీ, ప్రతిపక్షంగా ఉండలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐదేండ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదు. కమ్యూనిస్టులు మాత్రం ఎన్నేండ్లు అయినా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రజల తరఫున మాట్లాడటం, పోరాడటం పెద్ద బాధ్యత. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు నేతలు ముందుకు రావట్లేదు. సమస్యలపై పోరాడి… ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను దించడంలో కమ్యూనిస్టులు ముందున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నారాయణ, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీపీఐ(ఎం) పొలీట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ గుమ్మడి నర్సయ్య, ప్రొ.హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.