Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeకవర్ స్టోరీసమాజ రథసారథి గురువు

సమాజ రథసారథి గురువు

- Advertisement -

గురువు అనే పదాన్ని వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది బాల్యం. బాల్యం అనగానే వెంటనే మనసు పరుగెత్తేది బడిలోకి. బడి అనగానే తమ స్నేహితులతో పాటు తమను ప్రభావితం చేసిన గురువులు గుర్తుకు వస్తారు. మంచైనా చెడైనా ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. ఫలానా గురువు లేదా ఉపాధ్యాయుని వల్లే నేను ఈ రంగంలోకి వచ్చాను అనేవారు… ఫలానా గురువు నాకు ఆదర్శం అనే మాటలు – ఇవి చాలు గురువులు శిష్యులను ఎంతగా ప్రభావితం చేయగలరో…
‘మాత దేవోభవ. పిత దేవో భవ, ఆచార్య దేవోభవ’ ఈ వాక్యాలు కేవలం ఒక్క భారతీయ సంస్కతికే సంబంధించినవి అనడం కంటే ప్రపంచమంతా ఆచరించే, గౌరవించే అత్యున్నత విలువైన వాక్యాలుగా చెప్పుకోవచ్చు.
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్థకం అయ్యేలా చేసేది ఆచార్యులు లేదా గురువులే.
నేడు ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని చూడగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత సంపాదించినా, డిజిటల్‌ సంబంధమైన విద్యా విషయక మార్పులు ఎన్ని తెచ్చినా గురు స్థానం ఎప్పుడూ గురు స్థానమే. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఏ సాధనం ఇప్పటి వరకూ రాలేదు. రాబోదని కూడా ఘంటాపథంగా చెప్పవచ్చు.
మన భారతీయ సంస్కతిలో గురువుకు మహోన్నతమైన స్థానం ఉంది.
మనలో జ్ఞానాన్ని సష్టించి, నిలిపి, అజ్ఞానం తొలగించి, అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తిగా తయారు చేసి సమాజానికి అందించే వాడు గురువే.
తరగతి నాలుగు గోడల మధ్య ప్రపంచాన్ని దర్శింపజేసి ఎలా ఉండాలో నైతిక విలువలు, ఎలా బతకాలో లౌక్యం, పౌరుడిగా తన హక్కులు బాధ్యతలు తెలిసేలా చేసేది గురువే. గురువు సమాజ రథ సారథి. అభివద్ధి పథంలో నడిపించే దిశానిర్దేశకుడు. ఉన్నతమైన వ్యక్తిత్వపు మూల స్తంభం. అందుకే గురువు సర్వత్రా పూజ్యుడు.

రామాయణంలో విశ్వామిత్రుడు రాముడి గురు శిష్య బంధం మొదలుకొని మహాభారతంలో ద్రోణాచార్యుడు పాండవుల అనుబంధం, భాగవతంలో శ్రీకష్ణుడు సాందీప మహర్షి వద్ద చేసిన శిష్యరికం-గురు దక్షిణ- నేటికీ ఎంతో ఆదర్శవంతంగా నిలిచి గురువు శిష్యుల మధ్య ఉండే అపురూపమైన అనుబంధాన్ని అజరామరం చేసాయి.
అందుకే ప్రముఖ కవి కబీర్‌ ‘గురువు-దేవుడు ఇద్దరూ ఒకే సారి ప్రత్యక్షం అయితే మొదట తాను గురువుకే నమస్కరిస్తాను. నమస్కరించాలనే సంస్కారం నేర్పింది గురువే కాబట్టి గురువు పాత్ర ఎంతో గొప్పది’ అంటారు.
ఆ తర్వాత మనం చదువుకున్న ఎందరో మహనీయుల జీవిత చరిత్రలు- చదువుకున్నప్పుడు గురువుల సన్నిధిలో విద్యను అభ్యసించి భారత దేశ కీర్తిని ప్రపంచమంతా వ్యాప్తి చేసిన స్వామి వివేకానందుడు, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం గారి లాంటి వారు ఎందరో ఉన్నారు.
వివేకానందుని మాటల్లో ”మహోన్నతమైన గురువుల సమక్షంలో వారి బోధనలతో అత్యంత నీచులు, పతనమైన వారు కూడా మంచివారుగా మారి పోతారు” అంటాడు.
ఇక రవీంద్రుని మాటల్లో ”యంత్రాలు వస్తువులను తయారు చేయగలవు కానీ చేతికి అందించలేవు. యంత్రం నూనె తీయగలదు కానీ దీపాన్ని వెలిగించలేదు. కానీ ఉపాధ్యాయులు అలా కాదు. మట్టిని ప్రమిదగా చేయగలరు. దానిలో నూనె పోసి ఒత్తినీ వెలిగించగలరు. ఇలా విద్యార్థుల జీవితాలను వెలిగించే విజ్ఞాన దీపాలు. వారి దారి దీపాలు గురువులే” అంటారు.

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గారు ఒకానొక అతి సామాన్య స్థితి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన సైంటిస్ట్‌ గా, భారత దేశ రాష్ట్రపతిగా ఎదగడానికి ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయులు, వారి బోధనలను తరచూ గుర్తు చేసుకోవడం మనందరికీ తెలిసిందే.
ఈ విధంగా గురువుల పాత్ర వారి ప్రోత్సాహం విద్యార్థులఫై ఎంతగా ప్రభావం చూపుతుందో పై విషయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అలాంటి గురువును పూజించి గౌరవించేందుకు మన భారత ప్రభుత్వం సెప్టెంబర్‌ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించింది. మొట్టమొదటి ఉప రాష్ట్రపతి, తత్త్వవేత్త, పండితుడు, భారత రత్న అవార్డు గ్రహీత అయిన సర్వేపల్లి రాధాకష్ణన్‌ గారి జన్మదినమును 1962 నుండి మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వేడుకలు చేస్తున్నారు. ఆ రోజు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక అయిన వారికి సత్కార సన్మానాల హడావుడి ఎల్లెడలా నెలకొనడం మనం చూస్తుంటాం.
నేడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారి మన అందరం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒకనాడు పొందిన విధంగా నేడు గురువులు గౌరవం పొందుతున్నారా? సమాజం మాట అటుంచి పాఠశాలలో విద్యార్థులను తన బోధనలతో ప్రభావితం చేయగలుగుతున్నారా? అనే ప్రశ్నలు సంధించుకుంటే లేదు, లేదు అనే సమాధానమే వస్తుంది.
కారణాలు విశ్లేషించుకుంటే ‘కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో’ అని చెప్పవచ్చు. తప్పిదాలు రెండు వైపులా ఉన్నాయనడంలో కొంచెం మనసుకు కష్టమైనా నిజాన్ని ఒప్పుకోక తప్పదు.

ఒకప్పుడు గురువు/ ఉపాధ్యాయుడు తప్ప విద్యార్థికి జ్ఞానాన్ని అందించే ప్రత్యామ్నాయం ఇంకేది ఉండేది కాదు. అందుకే గురువు చెప్పిందే వేదమని ఒకవేళ గురువు తప్పు చెబితే దాన్ని ఇంట్లో వాళ్ళు సరిదిద్దినా ఒప్పుకునే వారు కాదు. అంతగా బలీయంగా గురువు ముద్ర విద్యార్థుల మనస్సులపై పడేది.
ఆనాడు గురువులు తాము పని చేసే ప్రాంతంలో ఉండటం వల్ల గ్రామంలో మంచి చెడులు చెప్పే హితైషిగా ఊర్లో వారందరి మర్యాద మన్ననలు పొందేవాడు.
రాన్రానూ పరిస్థితులు మారాయి. సాంకేతిక విప్లవంతో అనేక మార్పులు వచ్చాయి. సామాజిక, ప్రసార సాధనాలు, అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వచ్చాయి. గురువు పాత్ర కొంత అద్దం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళిలా మసకబారి పోయింది.

రవాణా సౌకర్యాలు మెరుగు పడటం వల్ల అయితేనేం, తమ సంతానం ఉన్నత చదువుల దష్ట్యా అయితేనేం- గురువులు తాము పని చేసే గ్రామాల్లో ఉండకుండా పట్టణాల నుండి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ప్రజల ఆలోచనా ధోరణిలో భయంకరమైన మార్పు తెచ్చిన ఆంగ్ల భాషపై మోజు కుప్పలు తెప్పలుగా కార్పోరేట్‌, కాన్వెంట్‌, ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దాంతో కూలన్న కూడా ఇంగ్లీషులో బాగా చదువుకుంటేనే రేపటి బతుకు తెరువు అన్న అమాయకత్వంతో చెమటోడ్చి సంపాదించినదంతా తమ సంతానపు కార్పోరేట్‌ చదువులకు వెచ్చిస్తున్నారు.
మరో కారణం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒకప్పుడు ప్రతి కుటుంబంలో సంతానం ఎక్కువగా ఉండేది. అందులో అందరూ చదవడం పట్ల ఆసక్తి చూపేవారు కాదు. నచ్చిన కుల వత్తి, వ్యవసాయ పనులు చేస్తే, చదువంటే ఇష్టపడిన ఒకరిద్దరు మాత్రమే బడిబాట పట్టేవారు. అలా బడికెళ్లే వారిని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టి కొట్టినా తిట్టినా మీదే భారం అని వారిని సంపూర్ణ విద్యావంతులుగా చేసే బాధ్యతను వినయంగా అప్పగించే వారు. దండనలో ఏమాత్రం కల్పించుకునే వారు కాదు.

కానీ నేడు అలా కాదు. ఒకరిద్దరు సంతానానికే పరిమితమైన తల్లిదండ్రులు అతి ప్రేమను కనబరుస్తున్నారు. వాళ్ళు అడగ్గానే బోలెడు డబ్బు ఖర్చు చేసి సెల్‌ ఫోన్‌ కొనిస్తున్నారు. అందులో తప్పేం లేదు. కొన్ని ప్రాజెక్టులు చేయాలన్నా, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన గ్రూపులో తమ విషయ సంబంధ అంశాల వంటి పనికోసం అవసరమే. కానీ వారిపై చూపే అతి ప్రేమ ఉపాధ్యాయుడి బోధనకు అంతరాయంగా మారింది. బోధనాభ్యసన సమయంలో అల్లరిని నియంత్రించడానికి కూడా మందలించలేని నిస్సహాయత ఏర్పడింది. ఈ పరిస్థితి ఎంతగా మార్పు తెచ్చిందంటే ఉపాధ్యాయుడంటే లెక్కలేనితనం, వారిని గౌరవించకపోవడం. ఏమైనా గట్టిగా అంటే బెదిరించేందుకు కూడా వెనుకాడటం లేదు.
అలాంటి స్థితిలో తరగతి గదిలో ఎలాంటి అవమానాల పాలు కాకుండా, ఆందోళన చెందకుండా బోధన చేయడం గురువుకు కత్తిమీద సాముగా మారింది.
ఇదో విచిత్రమైన పరిస్థితి అయితే, మరో కోణంలో చూస్తే కొందరు ఉపాధ్యాయుల కీచక పాత్ర, ప్రమాదకరమైన దండన ఉపాధ్యాయుల గౌరవాన్ని అమాంతంగా అధఃపాతాళానికి తోసేసింది.

మరేం చేద్దాం? కింకర్తవ్యం? గురువుకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ బోధనలు, డిజిటల్‌ పాఠాలు ఉపాధ్యాయుని పాత్రను భర్తీ చేస్తాయా? అంటే ముమ్మాటికీ పూర్తి చేయవనే చెప్పాలి. తరగతి గదిలో సజీవ ప్రపంచంలో గురు ముఖతా నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. గురువు ప్రేమ, అనురాగంతో పాటు ఆహార్యం, హావభావాలు, కంఠ స్వరం బోధనలో మాధుర్యం, వ్యక్తిగత శ్రద్ధ, ప్రయోగాలు మొదలైనవి కీలకమైన పాత్ర పోషించి విద్యార్థుల ఆచరణకు, అనుకరుణకు ఆదర్శంగా నిలుస్తాయి.
అద్దాన్ని కొంచెం శుభ్రం చేస్తే స్పష్టంగా ఎలా కనిపిస్తుందో అలాగే చంద్రుని వెన్నెల చల్లదనంలా, చీకట్లను తరిమేసే సూర్యుని కాంతి కిరణాల్లా గురువు జ్ఞాన కాంతులు విద్యార్థులపై ప్రసరించాలంటే తల్లిదండ్రులు, సమాజం తమదైన తోడ్పాటు అందించాలి. వారి మధ్యలో ఉన్న అగాధమంటి దూరాన్ని తొలగించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించి పునర్వైభవానికి తోడ్పడాలి. అప్పుడే గురుపూజోత్సవానికి సార్థకత చేకూరుతుంది.
– వురిమళ్ల సునంద, 9441815722

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad