నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారని ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలోని అనేక జిల్లాల్లో రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కొన్ని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి సహాయ బృందాలు చాలా ఇబ్బంది పడ్డాయని, కొండచరియలు విరిగిపడటంతో వారి పురోగతికి ఆటంకం ఏర్పడిందని తాలిబన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ (బిఎన్ఎ) నివేదించింది.
ఢిల్లీతో సహా పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని వెల్లడించారు. బలమైన ప్రకంపనలు సంభవించాయని, భవనాలు కంపించాయని ఆయా ప్రాంతాలలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.