నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రక్టో ఒలిగో శాకరాయిడ్స్ (ఎఫ్‌వోఎస్) తయారీ యూనిట్‌కు నిజామాబాద్ కేంద్రంగా మారింది. రివిలేషన్స్ బయోటెక్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్‌లో ఈ భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత బయోటెక్నాలజీ, ఆహార ప్రాసెసింగ్ రంగాలు మరింత బలోపేతం కానున్నాయి.
సంవత్సరానికి 20 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ యూనిట్ 2027 ఆగస్టు నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఆర్థిక సహాయం అందిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా అవసరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే రివిలేషన్స్ బయోటెక్, బీఐఆర్‌ఏసీ మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
ఎఫ్‌వోఎస్ తయారీకి చక్కెర ప్రధాన ముడిపదార్థం. తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక చెరుకు రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని, వారికి స్థిరమైన మార్కెట్ లభిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. దేశంలో పెరుగుతున్న మధుమేహ సమస్యకు చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ఎఫ్‌వోఎస్ ఒక మంచి పరిష్కారమని ఆయన తెలిపారు.