నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఓనం పండుగ సందర్భంగా కేరళ విధాన సభలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో కొంతమంది పురుష, మహిళా ఉద్యోగులు వేదికపై డ్యాన్స్ చేశారు. తోటి ఉద్యోగులు వారిని కేరింతలతో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే డ్యాన్స్ చేస్తున్న వారిలో ఒకరు అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న తోటి ఉద్యోగులు సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతను అప్పటికే చనిపోయాడు.
మృతుడిని 45 ఏళ్ల జునేష్ అబ్దుల్లాగా గుర్తించారు. వెంటనే అతన్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అసెంబ్లీలో జరిగే అన్ని ఓనం ఆటలు, కార్యక్రమాలలో జునేష్ చాలా చురుగ్గా ఉండేవారని తెలిపారు. అతను అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేసేవాడు. గతంలో, అతను మాజీ ఎమ్మెల్యే పివి అన్వర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసేవాడు. అతను వయనాడ్‌కు చెందినవాడిగా గుర్తించారు. జునేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.