Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసినర్‌ దూకుడు

సినర్‌ దూకుడు

- Advertisement -
  • క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌
  • ఒసాక, ఆమంద ముందంజ

యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ జానిక్‌ సినర్‌ (ఇటలీ) యుఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. సిన్సినాటి ఓపెన్‌ ఫైనల్లో గాయం నుంచి వాకోవర్‌ ఇచ్చిన సినర్‌.. న్యూయార్క్‌లో అదరగొడుతున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో వరుస సెట్లలో లాంఛనం ముగించి బబ్లిక్‌ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌), అరినా సబలెంక (బెలారస్‌) సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు.

న్యూయార్క్‌ (యుఎస్‌ఏ)
యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ) దూకుడు కొనసాగుతుంది. మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై 6-1, 6-1, 6-1తో ఏకపక్ష విజయం సాధించాడు. 81 నిమిషాల్లో క్వార్టర్స్‌ బెర్త్‌ సాధించిన సినర్‌..తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. 8 ఏస్‌లు, ఎనిమిది బ్రేక్‌ పాయింట్లతో అలెగ్జాండర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 24 విన్నర్లు కొట్టిన సినర్‌.. పాయింట్ల పరంగా 86-46తో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. అలెగ్జాండర్‌ 2 ఏస్‌లు, 13 విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. అలెగ్జాండర్‌ ఒక్కసారి కూడా సినర్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేయలేకపోయాడు. మరో మ్యాచ్‌లో పదో సీడ్‌ లొరెంజో ముసెటి (ఇటలీ) 6-3, 6-0, 6-1తో జెమీ మునార్‌ (స్పెయిన్‌)పై ఘన విజయం సాధించాడు. ఏడు ఏస్‌లు, ఏడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన ముసెటి.. తొలి సెట్లో కాస్త కష్టపడ్డాడు. కానీ తర్వాతి వరుస సెట్లలో ఆడుతూ పాడుతూ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 79-42తో మునార్‌ను చిత్తు చేశాడు. 29 అనవసర తప్పిదాలతో మునార్‌ మూల్యం చెల్లించాడు. ఆండ్రీ రూబ్లెవ్‌ (రష్యా)పై 7-5, 6-3, 6-4తో ఫెలిక్స్‌ ఆగర్‌ (కెనడా) వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. స్విస్‌ ఆటగాడు లీనాడ్రోపై 6-3, 6-2, 6-1తో అలెక్స్‌ (ఆస్ట్రేలియా) అలవోక విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌)తో జిరి (చెక్‌ రిపబ్లిక్‌)… నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా).. జానిక్‌ సినర్‌తో ముసెటి.. ఫెలిక్స్‌తో అలెక్స్‌ పోటీపడనున్నారు.

ఒసాక ముందంజ
మానసిక ఒత్తిడితో విరామం తీసుకుని మళ్లీ రాకెట్‌ పట్టిన జపాన్‌ స్టార్‌, నవొమి ఒసాక యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. అమెరికా యువ కెరటం, మూడో సీడ్‌ కొకొ గాఫ్‌పై ప్రీ క్వార్టర్స్‌లో ఒసాక 6-3, 6-2తో విజయం సాధించింది. మూడు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెప్పించిన ఒసాక.. కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న గాఫ్‌పై వరుస సెట్లలోనే గెలుపొందింది. 55-33తో పాయింట్ల పరంగా ఒసాక పైచేయి సాధించింది. కొకొ గాఫ్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా సాధించలేదు. 64 నిమిషాల్లోనే క్వార్టర్స్‌ బెర్త్‌ను ఒసాకకు వదిలేసింది. మరో మ్యాచ్‌లో అమెరికా అమ్మాయి ఆమంద అనిషిమోవ 6-0, 6-3తో బ్రెజిల్‌ క్రీడాకారిణి హదాద్‌ మేయపై విజయం సాధించింది. 5 ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లు సహా 64-39తో పాయింట్ల పరంగా ఆమంద అదరగొట్టింది. చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి కరొలినా ముచోవ 6-3, 6-7(0-7), 6-3తో మార్టా (ఉక్రెయిన్‌)పై మూడు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించింది. మార్టా 6 ఏస్‌లు, ఓ బ్రేక్‌ పాయింట్‌ సాధించింది. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. 1 ఏస్‌, మూడు బ్రేక్‌ పాయింట్లతో విజృంభించిన ముచోవా తుది సెట్లో అద్భుతంగా ఆడింది. పాయింట్ల పరంగా 105-103తో మార్టాపై ముచోవ స్వల్ప ఆధిక్యం సాధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad