– గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ వర్కర్లకు న్యాయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు పది నెలల పెండింగ్ వేతనాలను జీవో 60 ప్రకారం రూ.15,600 చొప్పున ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి జూలకంటి రంగారెడ్డి, ఇతర నాయకులు తీసుకెళ్లారు. ఎక్కడైనా వేతనాలు పెంచుతారుగానీ ఇక్కడ మాత్రం రూ.12 వేల వేతనాన్ని రూ.9,200కి తగ్గించారని వాపోయారు. జీఓ నెం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. పది నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా బతుకుతారని జూలకంటి ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి నెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి లక్ష్మణ్ వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి, అడిషనల్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీతాలు తగ్గించడం సరిగాదనీ, దీనిపై ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. పది నెలల బకాయి వేతనాలు పది రోజుల్లో విడుదలయ్యే చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, కంటిన్యూయేషన్ ఆర్డర్లు, తదితర సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు బ్రహ్మచారి, గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లా యిస్ యూనియన్ నాయకులు జలంధర్, జయ, తిరుపతమ్మ, స్వరూప, హీరాలాల్, కౌసల్య పాల్గొన్నారు