నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఎనిమిదేళ్ల ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా చిదంబరం స్పందిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ విధానాన్ని, ఇప్పటిదాకా ఉన్న రేట్లను మొదట్లోనే ప్రవేశపెట్టి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.
2017లో జీఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి తాము దీని డిజైన్, రేట్లపై హెచ్చరిస్తున్నా ప్రభుత్వం తమ మాటలను పెడచెవిన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. “మందగించిన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ అప్పులు, పడిపోతున్న పొదుపు, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి.. వీటన్నింటిలో ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.