భూమిసారం కోల్పోయే అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండేళ్లుగా గడ్డి మందు వినియోగం భారీగా పెరిగింది.మండలంలో ప్రధానంగా పండిస్తున్న పంటలలో కలుపు తీసేందుకు అత్యధికంగా రైతులు గడ్డి మందునే వినియోగిస్తున్నారు. కలుపు తక్కువ ఖర్చు కావడంతో గడ్డి మందుల వినియోగం పెరుగుతూ.. వస్తుంది.మండల వ్యాప్తంగా ఈఏడాది వానాకాలం సాగులో అత్యధికంగా వరి,పత్తి,మిర్చి పంటలు సాగవుతున్నాయి. ఒక వైపు కూలీల కొరత,మరో వైపు కలుపు తీసేందుకు ఖర్చులు తగ్గించుకోవడానికి రైతులు గడ్డి మందు విరివిరిగా వినియోగిస్తున్నారు.
అన్ని పంటలకు..
గతంలో వరి పంటలో కలుపు తీసేందుకు. మాత్రమే గడ్డి మందు వాడేవారు. పత్తి పంటల్లో గడ్డి మందు వాడే వారు కాదు. గడ్డి మందు పిచికారీ చేయడంతో పత్తి పంట ఎదుగుదల లోపిస్తుంది. పత్తి పంటల్లో కూలీలతోనే కలుపు ద్వారా గడ్డిని తీయించేవారు. కానీ గత రెండేళ్ల నుంచి పత్తి పంటలో సైతం కూలీలతో కాకుండా గడ్డి మందు ద్వారా కలుపు తొలగిస్తున్నారు.
భవిష్యత్లో గడ్డు కాలమే..
గడ్డి మందు అతిగా వాడకంతో రానున్న రోజుల్లో భూములు సారవంతం కోల్పోయే అవకాశం ఉంది. సారవంతమైన నల్లరేగడి భూముల్లో విష పూరితంగా మారి పర్యావరణానికి ముప్పుగా మారనున్నాయి.జీవవైవిద్యం దెబ్బతింటుదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గడ్డి ముందు ఎక్కువగా పిచికారీ చేసే వారు సైతం క్యాన్సర్ భారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.