నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ కు యూరోపియన్ దేశాలు అందిస్తున్న సెక్యూరిటీ గ్యారెంటీ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పొరుగు దేశంలో మోహరించిన ఏదైనా విదేశీ దళాలు రష్యా సైన్యానికి “చట్టబద్ధమైన లక్ష్యం” అవుతాయని హెచ్చరించారు. మాస్కో కైవ్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే భద్రతా హామీగా యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి దళాలను పంపుతామని యూరప్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దీంతో శుక్రవారం వ్లాదివోస్టాక్‌లో జరిగిన తూర్పు ఆర్థిక వేదిక ప్లీనరీ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
ఉక్రెయిన్‌కు అనుకూలంగా బలగాలను మోహరించడం దీర్ఘకాలిక శాంతికి ఏ మాత్రం దోహదం చేయదని పుతిన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న సన్నిహిత సైనిక సంబంధాలే ప్రస్తుత సంఘర్షణకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగిస్తే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇతర దేశాల సైనిక దళాలను మోహరించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.