Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపది లక్షల ఎకరాల భూముల్ని పంచిన చరిత్ర ఎర్రజెండా నాయకత్వానిది..

పది లక్షల ఎకరాల భూముల్ని పంచిన చరిత్ర ఎర్రజెండా నాయకత్వానిది..

- Advertisement -

కమ్యూనిస్టులే అసలైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు
మతోన్మాదులు పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు: సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబ్ బాబు 
నవతెలంగాణ – దుబ్బాక

‘దున్నేవాడిదే భూమి’ అన్న నినాదంతో భూస్వాముల చెరలోంచి పేద ప్రజలకు పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఎర్రజెండా నాయకత్వానిదేనని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబ్ బాబు చెప్పారు. దొరలు, భూస్వాములు, రజాకార్ల దోపిడి పీడనలకు వ్యతిరేకంగా.. తాడిత, పీడిత పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ పోరాటాన్ని వక్రీకరించే కుట్రలు పన్నిన మనువాదుల్ని చరిత్ర ఎన్నడూ క్షమించబోదని హెచ్చరించారు. శుక్రవారం దుబ్బాక లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో సీపీఐఎం ఆధ్వర్యంలో “కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత- పార్టీ నిర్మాణం “అన్న అంశంపై నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు సీపీఐఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. గోపాలస్వామి, జి. భాస్కర్ లతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

నాడు భూమికోసం భుక్తి, కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం,దున్నేవానికే భూమి కావాలని దొరలు,భూస్వాములు, రజాకర్ల దోపిడీ పీడనకు, వెట్టి  చాకిరికి వ్యతిరేకంగా పోరాడారని, ప్రజలందరినీ ఎర్రజెండా నాయకత్వంలో కుల మతాలకతీతంగా పోరాటాలు చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఎర్రజెండా నాయకత్వానిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులు 4,500 మంది ప్రాణాలు ఆర్పించారని ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు. ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరించి ఆనాడు జరిగిన పోరాటాన్ని మతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని ప్రజలు, చరిత్ర క్షమించదని, మతోన్మాదులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సమాజంలో దోపిడీకి గురవుతున్న కష్టజీవులకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనైనా కష్టజీవుల పక్షాన నిలిచింది, అనేక దేశాలలో వెట్టి చాకిరిని విముక్తి చేసింది ఎర్రజెండా మాత్రమేనని నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నది కమ్యూనిస్టులేనన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూ పంపకం ముఖ్యమైనదని, దున్నవానికే భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా నాయకత్వాన 10 లక్షల ఎకరాల భూములను పంచిందని గుర్తు చేశారు.  నేటికీ పాలకవర్గాలు పూర్తి చేయలేదని ఇప్పటికీ మిగులు భూములు ఉన్నాయని భూమిలేని నిరుపేదలకు పంచడంలో విఫలమయ్యారనీ విమర్శించారు.

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిలువ నీడలేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు నాటి ఇంటి స్థలాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే.. నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని, పేదలకు మాత్రం ఇంటి జాగా ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని సిద్దిపేట జిల్లాలో కూడా 26 మండలాలలో యూరియా దొరకక రైతాంగం ఎరువుల దుకాణాల ముందు బారులు తీరి రాత్రి, పగలు యూరియా బస్తాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రైతు పక్షపాతినని చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు తెలంగాణ రైతాంగం పడుతున్న ఇబ్బందులు కనపడతలేవా అని ప్రశ్నించారు.

జిల్లాలో ప్రభుత్వం,అధికార యంత్రాంగం రైతాంగానికి యూరియా అందించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. వెంటనే రైతాంగానికి యూరియా అందించాలని లేనిపక్షంలో సీపీఐఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని, కనీస సౌకర్యాలు కూడా అందడం లేదన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి పాటు పాడాలన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. 

 సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ…

 సెప్టెంబర్ 15 న దుబ్బాకలో జరిగే (తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల) సంస్మరణ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ప్రాంతంలో తోగుట మండలంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పరిహారాల కొరకు ఈ ప్రాంతంలో ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్న అనేక రకాల ప్రజా పోరాటాల నిర్వహించిన చరిత్ర, దుబ్బాక రెవెన్యూ డివిజన్ కొరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని తెలిపారు.

ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల, నిరంతరం సమస్యల పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు సింగిరెడ్డి నవీన, దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, అక్బర్ పేట భూంపల్లి మండల కార్యదర్శి లింగంపేట ఎల్లయ్య, మిరుదొడ్డి మండల కార్యదర్శి మద్యల అంజయ్య, నాయకులు సాజిద్, మల్లేశం, శ్రీనివాస్, మహేష్, సాదిక్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, దినేష్, ప్రశాంత్, వివిధ మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad