భరించలేని స్థాయిలో విద్య, వైద్యం ఖర్చులు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
‘భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి.. భారత ప్రభుత్వ వైఖరి’పై సదస్సు
నవతెలంగాణ-గోదావరిఖని
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బరితెగించి మాట్లాడుతూ సుంకాలు విధించినా.. దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రామిక భవన్‌లో ‘భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి – భారత ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, విద్య, వైద్యం ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకున్నాయని అన్నారు. కులం, మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువుల సరఫరాలోనూ కేంద్రం విఫలమైందన్నారు.
ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని ఎన్నికలను తారుమారు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, బీహార్‌లో 65 లక్షల 50 వేల ఓటర్లను ఎస్‌ఐఆర్ పేరుతో తొలగించిందని వివరించారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతుందనుకుంటుందో అక్కడ వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని, దీనిపై బీహార్‌లో అన్ని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం నడుస్తోందని చెప్పారు. అందుకే దేశ ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం పోరాటంలోకి రావాలని సీపీఐ(ఎం) పక్షాన పిలుపునిచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతం పేరు మీద విభజన తీసుకురావడానికి కుట్ర పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టి హిందూ, ముస్లింల మధ్య విభేదాలు పెంచే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికత్వం, ప్రజాస్వామ్యానికి మోడీ పాలనలో ప్రమాదం ఏర్పడిందని, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు.
మన దేశం నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై 50 శాతం సుంకాలు విధించి, మన సరుకులు అమ్ముడుపోకుండా చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారని, ఇది భారతదేశ ఆత్మగౌరవానికి దెబ్బ అని వీరయ్య చెప్పారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేసి లాభపడాలని ట్రంప్ చూస్తున్నారని అన్నారు. ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని, ఇది 140 కోట్ల దేశ ప్రజల ఆత్మగౌరవానికి, ప్రయోజనాలకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ సదస్సుకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఏ.మహేశ్వరి అధ్యక్షత వహించగా.. జిల్లా కార్యదర్శి వై. యాకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, నాయకులు జి.జ్యోతి, ఎన్.బిక్షపతి, బూడిద గణేష్, దొమ్మేటి కొమరయ్య పాల్గొన్నారు.
ట్రంప్ బరితెగింపుపై మోడీ నోరు మెదపరే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES