Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుయూరియా కొరత.. పంట దిగుబడిపై ప్రభావం

యూరియా కొరత.. పంట దిగుబడిపై ప్రభావం

- Advertisement -

పొద్దస్తమానం పనులు మాని క్యూ లైన్‌లో రైతులు
నానో యూరియా సత్ఫలితం ఇవ్వట్లేదని ఆవేదన
సకాలంలో ఎరువు వేయక మొక్కల్లో ఎదుగుదల లోపం
ఎర్రబారుతున్న వరి.. కంకులేయని మక్క.. పత్తి పరిస్థితీ అంతే..!
అనధికారిక సాగుతో ఏజెన్సీ గోస తీరే వేరు..


నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సకాలంలో సరిపడా యూరియా అందకపోవడంతో ఆశించిన మేరకు పంట దిగుబడులు రాకపోవచ్చని రైతాంగం ఆందోళన చెందుతోంది. సాగు మొదలై మూడు నెలలు కావస్తున్నా.. పంట ఎదుగుదల లేదని రైతులు వాపోతున్నారు. ఓ పక్క అధికారులు యూరియా కొరత లేదని అంటున్నా.. రైతులు క్యూ లైన్‌లో బారులు తీరి ఉంటున్నారు. ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే వేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ కొరత కారణంగా ఎకరాకు ఒక్క బస్తా కూడా వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోడు వ్యవసాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. యూరియాకు బదులు నానో యూరియా పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం నానోకు నో చెబుతున్నారు. నానో యూరియా పిచికారి చేస్తే పచ్చదనం వస్తుందే తప్ప ఎదుగుదల లేదంటున్నారు. యూరియా కోసమే రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే అదను దాటి పోతోందని, ప్రయివేటుగా కూడా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటలపై ప్రతికూల ప్రభావం
రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. దీనిలో వరి అత్యధికంగా 60 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. అలాగే, పత్తి 50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.40 లక్షలు, కంది 5.10 లక్షలు, మిరప 1.90 లక్షలు, సోయాబీన్‌ 4.10లక్షలు, పెసలు 65వేలు, మినుములు 28వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటిలో మూడు నెలల్లో మొక్కజొన్న చేతికందాల్సి ఉండగా.. ఎదుగుదల లేక కొంత ఎత్తులోనే తల వెన్ను దశకు చేరుకుంది. అక్కడక్కడా పీచులు తీయగా కంకిలో నాణ్యత లేదని రైతులు చెబుతున్నారు. ఇక వరి పొలాలు సైతం యూరియా అందక ఎర్రబారుతున్నాయని ఆరోపిస్తు న్నారు. పొట్ట దశకు వచ్చే సరికి రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉంటుంది. కానీ దుక్కి మందుతోనే రైతులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక పూత దశకు చేరాల్సిన పత్తి చేలు ఎదుగుదల లేక అడుగు మేరనే పెరిగాయి. ఎక్కువ కాత రావడం లేదు. ఇప్పుడిప్పుడే మిర్చి నాటుతున్నారు. కానీ యూరియా లేక ఈ పంట సాగులోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పైగా యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులు మానేసి పీఏసీఎస్‌, మన గ్రోమోర్‌ వద్ద పడికాపులు కాస్తున్నారు. పొద్దస్తం అక్కడే ఉండటంతో వ్యవసాయ పనులు వెనుకబడుతున్నాయి. ఫలితంగా సేద్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ సారి ఆశించిన పంట దిగుబడులు రావేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కృత్రిమ ఎరువులు దూరమై.. రసాయన ఎరువులు భారమై..
ఒకప్పుడు రైతులు సేంద్రియ ఎరువుల ఆధారంగా సేద్యం చేసేవారు. ఆ సమయంలో కార్పొరేట్ల మేలేంచిన ప్రభుత్వాలు.. అధిక దిగుబడులు వస్తాయనే సాకుతో రైతులను రసాయన ఎరువుల వైపు మళ్లించాయి. క్రమేణా వ్యవసాయం యాంత్రీకరణై పశుసంపద క్షీణించడంతో రైతాంగం సేంద్రియ ఎరువులను వదిలి పూర్తిగా రసాయన ఎరువులను వినియోగించటం మొదలుపెట్టారు. ఇప్పుడు అవే రసాయన ఎరువులు ప్రభుత్వాలకు భారం కావడం.. కృత్రిమ ఎరువులు దూరమవటంతో.. ద్రవరూప రసాయన ఎరువుల వైపు రైతులను మళ్లించాలనే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ ఒక ఒరువడికి అలవాటు పడిన రైతాంగం అంత త్వరగా నానో ఎరువుల వైపు మళ్లేందుకు సుముఖంగా లేరని వ్యవసాయ అధికారుల మాట.

ప్రయోజనాలు ఉన్నాయన్నా నానోకు నో..!
ద్రవ రూపంలో ఉన్న నానో యూరియాతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న సాధారణ యూరియాను దుక్కిలో చల్లటం ద్వారా కేవలం 30శాతం మాత్రమే పంటకు అందుతుందని అంటున్నారు. అదే నానో యూరియాతో ఖర్చు తక్కువ.. 80శాతం పంటకు అందుతుందని, నానో యూరియాను ఆకుల మీద పిచికారి చేసినప్పుడు ఇది పత్ర రంధ్రాల ద్వారా సులభంగా ఆకుల్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. అర లీటర్‌ నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమంటున్నారు. కానీ రైతులు మాత్రం నానో ఎరువులకు నో చెబుతున్నారు. యూరియా ఒక్కో బస్తాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. అది పోను రైతులకు ఒక్కో బస్తా రూ.266కు విక్రయిస్తున్నారు. దీనికి రవాణా ఖర్చులు అదనం. ఇక నానో యూరియా అరలీటరు కేవలం రూ.225 మాత్రమే ఉండగా.. దీనికి ఎలాంటి సబ్సిడీ ఉండదు. రైతులకు అవగాహన లేక నానో యూరియాను వినియోగించడం లేదు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు రైతులకు మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

‘పోడు’ గోస వేరు..
పోడు సాగులో ఉన్న పూర్తి భూమి లెక్కలు అధికారుల రికార్డుల్లో లేకపోవడం వల్ల ఏజెన్సీ రైతుల గోస మరింత జఠిలంగా తయారైంది. అధికారుల లెక్కల ప్రకారం ఏజెన్సీలోని ప్రతి మండలంలో మొక్కజొన్న, పత్తి, మిర్చి, వరి, పొగాకు సాగవుతోంది. అనధికారికంగా సాగు చేస్తున్న దానిమీద అదనంగా మరో పదివేల ఎకరాల వరకూ అనధికారికంగా సేద్యం చేస్తున్నారు. అయితే అధికారుల దృష్టిలో అంత మొత్తంలో భూమి సాగులో లేదు కాబట్టి.. ఇప్పటి వరకు సరఫరా అయిన యూరియా సరిపోతుందని అంచనా వేస్తున్నారు. కానీ అనధికారికంగా సాగవుతున్న పంటలు, వాటికి అందాల్సిన యూరియాపై వీరికి పట్టింపు లేకుండా పోయింది. వెరసి ఏజెన్సీ రైతులకు యూరియా తిప్పలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పోడు రైతులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఇదే సమస్య ఉత్పన్నమవుతోంది.

నానో యూరియాతో పచ్చదనం తప్ప ప్రయోజనం లేదు
నానో యూరియా పిచికారి చేసినా ప్రయోజనం ఉండటం లేదు. పచ్చదనం వస్తుందే తప్ప పైరు ఎదుగుదల లేదు. సాధారణ యూరియా లాగా.. నానో యూరియాపై పూర్తి స్థాయిలో చాలా మందికి అవగాహన లేదు. యూరియా సరిపడా ఇస్తేనే పంట దిగుబడులు వస్తాయి. సకాలంలో వేయాల్సిన ఎరువు.. అందుబాటులో లేక వరి చేన్లు ఎర్రబారుతున్నాయి. మొక్కజొన్న ఎదుగుదల లేదు. కంకి గింజలు సరిగ్గా రావటం లేదు. యూరియా వేయకపోవడంతో బలం లేక కంకులు సరిగ్గా పడటం లేదు. పత్తి పరిస్థితి కూడా ఇంతే ఉంది.
-వనవాసం రాంరెడ్డి, గుండెపుడి,
మహబూబాబాద్‌ జిల్లా

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad