- Advertisement -
- క్యూ నివారణకు ముందుగానే రైతులకు టోకెన్లు
- అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా కౌంటర్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుల క్యూ నివారణకు ముందుగానే వారికి టోకెన్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలిస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. కో-ఆపరేటివ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పోలీసు, విజిలెన్స్ విభాగాలతో కూడిన పర్యవేక్షణ వలన ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజుల్లో రోజుకు కనీసం 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున రెండు లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాలని గురువారం ఢిల్లీలో క్యాబినెట్ సెక్రటరీని కోరామని తెలిపారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలనీ, అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -