నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతుండగా, లడ్డుల వేలంపాటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డు ఏకంగా రూ. 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. శుక్రవారం జరిగిన ఈ వేలంపాటలో గత ఏడాది రికార్డును తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది.
కీర్తి రిచ్మండ్ విల్లాస్ కమ్యూనిటీలో వినాయక నవరాత్రులను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా నిమజ్జనానికి ముందు లడ్డు వేలం వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జరిగిన వేలంలో లడ్డును రూ. 2 కోట్ల 31 లక్షల 95 వేలు వెచ్చించి దక్కించుకున్నారు. ఈ భారీ మొత్తం నగరంలోని ఓ కమ్యూనిటీలో పలికిన అత్యధిక ధరగా నిలిచింది.
గతేడాది ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ. 1.87 కోట్లు పలకగా, ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ సుమారు రూ. 45 లక్షలకు పైగా అధికంగా ధర పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ శోభాయాత్రలు, లడ్డు వేలంపాటలు ఉత్సాహంగా జరుగుతున్న వేళ, ఈ రికార్డు ధర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.