Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంNarra Ramesh: ఆదర్శ కమ్యూనిస్టు నర్రా రమేశ్‌కు నివాళులు...video

Narra Ramesh: ఆదర్శ కమ్యూనిస్టు నర్రా రమేశ్‌కు నివాళులు…video

- Advertisement -








  • పెట్టుబడిదారి సమాజానికి చివరిరోజులు
  • మళ్లీ కమ్యూనిస్టు ఉద్యమం చిగురించే రోజులు
    మోడీ అంతటి వ్యతిరేకే ఎర్రజెండాకు దండాలు
    ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోతున్న అమెరికా
    ఆదర్శ కమ్యూనిస్టు నర్రా రమేశ్‌కు నివాళులు
    సంతాప సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని

    నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం: ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమం, సిద్ధాంతాల బలం బలహీనపడిన పరిస్థితుల్లో ఉద్యమాన్ని అంటిపెట్టుకోవటం అనేది గొప్ప కమ్యూనిస్టు లక్షణం…అటువంటి లక్షణమున్న నాయకుడు నర్రా రమేశ్‌ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. పెట్టుబడిదారి సమాజానికి చివరి ఆశలు కొన్ని ఉన్నాయని తెలిపారు. మళ్లీ కమ్యూనిస్టు ఉద్యమం చిగురించే రోజుల్లో రమేశ్‌ చనిపోవటం దురదృష్టకరమన్నారు.

అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందిన మాజీ కౌన్సిలర్‌, పార్టీ జిల్లా నాయకులు నర్రా రమేశ్‌ (58) సంతాప సభ పార్టీ జిల్లా కార్యాయలంలో జరిగింది. రమేశ్‌ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించిన అనంతరం సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడారు. కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేకి, మతోన్మాది, అమెరికాకు వంగి వంగి దండం పెట్టిన ప్రధాని మోడీ ఇప్పుడు చైనా వెళ్లి ఎర్రజెండాకు నమస్కరించే పరిస్థితులు వచ్చాయన్నారు. మనమంతా కలిసి అమెరికాను ఎదుర్కోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా ప్రధాని పుతిన్‌తో కలిసి ఫ్రంట్‌ ఏర్పాటుకు సిద్ధపడటమే కమ్యూనిస్టు ఉద్యమానికి మంచిరోజులు వచ్చాయనేందుకు నిదర్శనమన్నారు. జాతీయోద్యమం గురించి రమేష్‌ గొప్పగా పాఠం చెప్పేవాడని, జాతీయోద్యమం అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమని వివరించాడని గుర్తు చేశారు.

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు దేశాన్ని దోపిడీ చేస్తుంటే 200 ఏళ్ల పాటు భారతీయులు పోరాడారని, ఆ పోరాటాన్ని తన గొంతుతో శ్రావ్యంగా వినిపించేవాడు రమేశన్నారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదం బలహీనపడి, ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయే స్థితి వచ్చిందన్నారు. ఇదీ కమ్యూనిస్టులు చెప్పేమాట కాదు…ప్రపంచ పెట్టుబడిదారులు కూడా అంగీకరిస్తున్న విషయమన్నారు. రమేశ్‌ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటమే మనందరి ముందున్న కర్తవ్యమని తెలిపారు. రమేశ్‌కు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల తరఫున హృదయపూర్వక నివాళులర్పించారు. + నర్రా రమేశ్‌లో గొప్ప కమ్యూనిస్టు లక్షణాలు నర్రా రమేశ్‌ మరణం చాలా బాధాకరమన్నాని, అతని శక్తిసామర్థ్యాలు ప్రత్యేకమైనవని తమ్మినేని తెలిపారు. మాట్లాడటం, ప్రజల్లోకెళ్లటం…సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం, ప్రజల పట్ల అంకితభావంతో పనిచేయటం, స్నేహబంధాలు ఏర్పరుచుకోవటం రమేశ్‌కున్న గొప్ప లక్షణాలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రమేశ్‌కున్న సామర్థ్యాలను బట్టి చూస్తే జిల్లా నాయకుల్లో ఏ ఒక్కరికన్నా తక్కువ కాదన్నారు.

నిర్మాణ సామర్థ్యం, దక్షత, సైద్ధాంతిక స్పష్టత ఉన్న కామ్రేడన్నారు. ఆస్థాయి ఆలోచనలు కలిగిన వారు కూడా కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఇతర కష్టాలు, ఆరోగ్య పరిస్థితుల వల్లనో పరిమితులు పెట్టుకుంటారు. కానీ ఇవేవీ కారణాలు కాకుండానే రమేష్‌ తనకు తానే పరిమితి విధించుకున్నారని, ఆ సామర్థ్యాలను పార్టీకి వినియోగించకుండా దూరమయ్యారన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ముఖ్యమైన రెండు లక్షణాలను గమనిస్తున్నామని, కొద్దిమంది పార్టీ సిద్ధాంతాన్ని, ఆశయాన్ని అర్థం చేసుకొని నమ్మి, తుదికంటా పార్టీకి కట్టుబడి పనిచేస్తారని, సిద్ధాంతం పట్ల విశ్వాసం కలిగి ఉంటారన్నారు. కానీ వారిలో ఎక్కువమందికి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండటం కష్టమనీ, అదీ వాళ్లలోపమని కాదు, వాళ్లు పెరిగిన తీరు, ప్రజలతో కలిసిపోయే టాలెంట్‌, ప్రజల నాడిని అర్థం చేసుకొనే స్వభావంలో పరిమితులు ఉండొచ్చుఅన్నారు.

పార్టీ సిద్ధాంతాన్ని, మార్క్సిజాన్ని అర్థం చేసుకోవటం వేరు…దానికి అతీతంగా ఇవ్వాళ ఉన్న సమాజం అవసరాలను అర్థం చేసుకొని ప్రజలతో కలిసిపోవటం వేరన్నారు. ఇవి రెండూ మిక్స్‌కానప్పుడు ప్రజానాయకులు కాలేరరని, పార్టీ నాయకులు మాత్రమే కాగలుగుతారన్నారు. ప్రజల్లో రాణింపు తెచ్చుకోవటంలో వీరిలో పరిమితులు ఉంటాయన్నారు. రెండో రకం చాలా పాపులర్‌గా ఉంటారు…ప్రజలను సూదంటిరాయిలా ఆకర్షిస్తారు…కానీ సిద్ధాంతాలు శూన్యంగా ఉంటాయన్నారు. ఇలాంటి వాళ్లు చాలా స్పీడ్‌గా పెరుగుతారు…కానీ ఎన్నాళ్లు ఉంటారో…ఎప్పుడు బయటకు పోతారో తెలియదన్నారు. ఆ రకమైన అనుభావాలు కూడా చాలా ఉన్నాయని, ఇవి రెండు లక్షణాలు కూడా ఒకే మనిషిలో ఉండటమనేది చాలా అరుదన్నారు. ఈ రెండు లక్షణాలు ఉన్న ఆదర్శకమ్యూనిస్టు కామ్రేడ్‌ నర్రా రమేశ్‌ అని వివరించారు. వ్యక్తిత్వ విషయాల్లో ఒకటి, అర లోపాలు చూపి దానిని బట్టి అంచనా వేయటమనేది కరెక్ట్‌ కాదన్నారు.

మనిషి జీవితంలో అనేక కోణాలు ఉంటాయని, కానీ ప్రజలకు సంబంధించి ఏ ఆశయం కోసమైతే అంకితమయ్యామో దానిని పాటించటం..ముందుకు తీసుకుపోవటంలో రమేశ్‌ నిర్వహించిన ప్రాత అనేకముందన్నారు. 58 ఏళ్ల వయసులో సుమారు 40-45 ఏళ్లపాటు అదే ఆశయానికి కట్టుబడి ఉండటం, వేరే స్వార్థం లేకుండా ఉండటం…అనారోగ్యంలోనూ పార్టీ గురించి ఆలోచించటం నర్రా రమేశ్‌లో ఉన్న ఉత్తమ కమ్యూనిస్టు లక్షణమని తెలిపారు. కుటుంబం ఇబ్బందులపాలైనా పార్టీ ఇబ్బందుల పాలుకాకూడదు అనే ఆలోచన చేసిన వారే గొప్ప కమ్యూనిస్టన్నారు. దురదృష్టవశాత్తు ఆయన శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించే ఆలోచన తను చేయలేకపోయాడన్నారు. ఆయన ఆలోచనను తీర్చిదిద్ది, లోపాలను అధిగమించే విషయంలో మేము కూడా సరైన కృషి చేయలేదేమో..! అనిపిస్తోందని తమ్మినేని ఆవేదన చెందారు. రమేశ్‌ నుంచి పట్టుదలను అంకితభావాన్ని మనం నేర్చుకోవాల్సి ఉందన్నారు. కష్టసమయంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమాన్ని అంటిపెట్టుకోవటం అనేది సాధారణ విషయం కాదన్నారు.

విద్యార్థి, యువజన ఉద్యమంలో నర్రా రమేశ్‌ కీలకంగా వ్యవహరించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. పార్టీ అవసరాలు ఎక్కడున్నాయంటే అక్కడికెళ్లి పనిచేశాడని గుర్తు చేశారు. చిన్న వయస్సులోనే వామపక్ష భావాల వైపు వచ్చిన నర్రా రమేశ్‌ ఖమ్మం నగర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. పేదల ఇండ్ల స్థలాలు, మంచినీటి సమస్యపై కౌన్సిలర్‌గా గళమెత్తారన్నారు.+ ర్యాలీగా నర్రా రమేశ్‌ అంతిమయాత్రనర్రా రమేశ్‌ అంతిమయాత్ర నగరంలో ర్యాలీగా సాగింది. సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుంచి భౌతికకాయాన్ని ప్రదర్శనగా బురహాన్‌పురంలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠ ధామం వరకు యాత్ర సాగింది. అక్కడ రమేశ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. నర్రా రమేశ్‌కు భార్య నాగలక్ష్మి, కుమార్తె లోహిత, కుమారుడు లిఖిత్‌ ఉన్నారు. ఆయన సతీమణి నాగలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సంతాప సభలో ఈ సంతాపసభలో కార్పొరేటర్లు యర్రా గోపీ, యల్లంపల్లి వెంకట్రావ్‌, బి.వెంకట్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజె రమేశ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పి.రాజారావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పార్టీ సీనియర్‌ నాయకులు పి. సోమయ్య, ఎం.సుబ్బారావు, దేవేంద్ర, పొన్నం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు శింగు నర్సింహారావు, ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా నాయకులు సీవై పుల్లయ్య, అశోక్‌, డాక్టర్‌ చీకటి భారవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad