Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeపరిశోధనకాకతీయుల చరిత్రకు సాక్షిగా చందుపట్ల

కాకతీయుల చరిత్రకు సాక్షిగా చందుపట్ల

- Advertisement -

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ జాతీయ రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో చారిత్రక చందుపట్ల గ్రామం ఉంది. ఒకవైపు సెలయేరు, మరో వైపు రాసముద్రం చెరువు, పచ్చని పొలాల మధ్య కొలువైన అందమైన పల్లె చందుపట్ల.
ఈ ఊరుకు చారిత్రక నేపథ్యంతో పాటు చరిత్రతో విడదీయలేని అనుబంధమూ ఉంది. కాకతీయ ధీరవనిత, సాహసానికి మారు పేరైన రుద్రమ అమరత్వం పొందిన నేల ఇది. ఆమె మరణానికి ధ్రువీకరణగా శిలా శాసనమూ ఇక్కడ కొలువై ఉంది. చందుపట్ల శాసనమై.. చరిత్రకు ఆనవాలై వేనోళ్ల కీర్తింపబడుతోంది. చారిత్రక రా సముద్రం ఉన్నది కూడా ఈ ఊరిలోనే. వరంగల్‌ కేంద్రంగా పరి పాలన సాగించి 80 ఏండ్ల వయసులో శతసైన్యం పైకి కత్తి దూసి కదనరంగంలో కన్నుమూసింది. కాకతీయ వీరవనిత రాయగజకేసరి రాణి రుద్రమదేవి వీరమరణాన్ని ధవీకరిస్తున్నది.

చందుపట్లకు ఆ పేరు ఎలా వచ్చింది…
ప్రస్తుతం గ్రామంలో ఉన్న వాగు, చెరువు ప్రాంతమంతా నాడు చండ్ర చెట్లు ఎక్కువగా ఉండేవట. వాటిని కొట్టేసి చిన్న గ్రామాన్ని నిర్మించారు. ప్రస్తుతం రాణి రుద్రమదేవి శిలాశాసనం ఉన్న ప్రాంతంలోనే ఆనాడు గ్రామం ఉండేది. రాను రాను ముందుకు విస్తరించారు. రుద్రమదేవి మరణ శాసనంలో చండ్రుపట్ల అని రాసి ఉంది. తర్వాత కాలంలో సండ్రుపట్ల, సందు పట్ల, చివరికి చందుపట్లగా మారింది. నేటికి ఈ గ్రామంలో సండ్ర ఇంటి పేరున్న వాళ్లున్నారు.

చారిత్రక ఆనవాళ్లు ఎన్నెన్నో…
చందుపట్ల గ్రామంలో బహత్‌ శిలాయుగం నాటి రాకాసిగూళ్ళు అనేకం ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలోని పాదూరి వారి గూడెం, కందిమల్ల వారి గూడెంలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం నాటి ఇనుప యుగపు సమాధులు ఉన్నాయి. 3 వేల ఏండ్ల నాటి (బహత్‌ శిలా యుగపు నాటి) స్మారక శిల ఇక్కడ ఉంది. ఈ శిల ఎండాకాలంలో ఎరుపు రంగులోకి మారుతుండటం వల్ల దీనిని నెత్తుటి స్తంభం అని కూడా పిలుస్తారు. ఈ స్థంభం భూమి లోపల 6 అడుగులు, భూమి మీద 11 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నెత్తుటి స్తంభం. ఇనుప యుగపు తెగ నాయకునికి గుర్తుకు నిలయమని చెప్తుంటారు.
రుద్రమ మరణ శాసనం పక్కనే అలనాటి సోమనాథ దేవాలయం నేడు గ్రామదేవతల ఆలయంగా పూజలందుకుంటోంది. గ్రామం మధ్యలోని గణపతి దేవాలయం, దాని సమీపంలోని గుర్రంపై స్వారీ చేస్తున్న రుద్రమదేవి రాతి విగ్రహాలు కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకలు. శిథిల దశలో ఉన్న గణపతి దేవాలయానికి ఇటీవల విగ్రహ పునఃప్రతిష్ట చేసి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.

పోరుగడ్డకు దండాలు
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని ఈ ఊరి మట్టిలో ఇంకా పౌరుషాగ్ని కణకణమంటుంది.
అక్కడి గాలిలో అణువణువునా వీరత్వం నిండి ఉంటుంది. స్వాతంత్య్రోద్యమ జాడలు, తెలంగాణ సాయుధ పోరు ఆనవాళ్లు అడుగడుగున కనిపిస్తాయి. అంతకుమించి చారిత్రక నేపథ్యమూ ఉంది. అసమాన ధైర్య సాహసాలతో శత్రువుల గుండెల్ని చీల్చిన రాణీ రుద్రమదేవి ఆఖరి రక్తపు బొట్టు చిందించిందిక్కడే. 1289 సంవత్సరం నవంబర్‌ 27న చందుపట్ల గ్రామంలో జరిగిన యుద్ధంలో రుద్రమ మరణించింది. నకిరేకల్‌ నుంచి చందుపట్ల గ్రామంలోకి ప్రవేశించగానే నాలుగు అడుగుల గద్దెపై కొలువైన ఈ చారిత్రక శాసనం స్వాగతం పలుకుతుంది. ఈ శాసనం 1957లో బయటపడింది. 1987లో ప్రఖ్యాత చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి శిలాశాసనంపై అనేక పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇటీవల దొరికిన మెడిమెకల్‌ శాసనం కూడా చందుపట్ల శాసనం తిరుగులేనిదని బలప రుస్తున్నట్లు చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ నిర్ధారించారు. ఔరంగ జేబు పాలన కాలం నాటి నాణెలు కూడా ఇక్కడ లభించాయి.

శాసనంతోనే వెలుగులోకి వచ్చిన చరిత్ర
గ్రామ శివారులో ఉండే రా సముద్రం రుద్రమ కాలంలో తోడించిందేనని… ఇక్కడి నుండే శత్రుసేనలను ఓడించేందుకు వ్యూహం పన్నేవారని అంటుంటారు. వీటన్నింటినీ సూచిస్తూ రుద్రమ సేనాని పువ్వుల ముమ్మడి చేయించిన త్రిపురాంతక శాసనం ఉందని అంటుంటారు. కాయస్థ అంబదేవుని వల్ల రాణి రుద్రమ హతమైనట్లు, ‘సర్వాన్‌ ఆంధ్ర మహీపత్రస్‌ ఉత్వ రణముభే యశోల్డెవాన్‌’ అని ఆ శాససంలో పేర్కొన్నారు. ఈ శాసనాన్ని గ్రామంలోని కొందరు ఔత్సాహికులు శిలా శాసనమని గుర్తించి 2003 నవంబర్‌ 27న గద్దెపై ప్రతిష్టించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే.. రుద్రమతో సహా ఇతర కాకతీయ రాజులు ఈ గ్రామం నుంచి శ్రీశైలంకు వెళ్లేవారట. ఈ ఊరి గుండా నేరుగా శ్రీశైలానికి రహదారి ఉండేదంటుంటారు. పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల, పానగల్లు పట్టణాల మీదుగా కాకతీయ రాజుల పయనం సాగేదని అక్కడ కనిపించే శిథిలిమైన రోడ్లు ఇతర కట్టడాలు సూచిస్తున్నాయని చరిత్రకారులు చెప్తున్నారు.

యువజన సంఘం కషితో రుద్రమ విగ్రహం
రుద్రమదేవి శివసాయిజ్యం పొందడాన్ని ధ్రువీకరిస్తున్న శాసనం వెలుగులోకి తేవడానికి చందుపట్ల గ్రామంలోని వివేకానంద యువజన మండలి కషి చాలా ఉంది. అప్పటి కలెక్టర్‌ పురుషోత్తంరెడ్డి రూ.80 వేలు సహాయం చేయడంతో ఒక గద్దె నిర్మించారు. గ్రామస్థుల సహకారంతో ఆరున్నర లక్షల రూపాయలతో రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. 10 అడుగుల ఎత్తు, 7 క్వింటాళ్ల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. గ్రామస్థుల కష్టానికి ఫలితంగా ప్రతిష్టకు నోచుకున్న శాసనం వివరాలు దూరవిద్యను అభ్యసించే ఎంఏ తెలుగు విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. దీనిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎంఏ తెలుగులో, ఇంటర్మీడియట్‌ చరిత్రలో, ఏడో తరగతి చరిత్రలో సైతం చందుపట్ల శాసనం పాఠ్యాంశంగా చేర్చేలా పాఠ్యప్రణాళిక సంఘం వారిని ఒప్పించి చేర్పించారు.

మొదటి సంత చందుపట్లలోనే
నకిరేకల్‌ పట్టణంలో నాడు 9వ జాతీయ రహదారి నిర్మించక ముందు చందుపట్ల గ్రామంలోని సంత నిర్వహించేవారు. ఆ గ్రామంలో నాగుల బావి నుండి మర్రూరు గ్రామ బాట వరకు ఉన్న వీధికి ఇరువైపులా దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఎడ్ల బండ్లు, జనంతో కిక్కిరిసేది. ఇప్పటికీ ఆ బజారును అంగడి బజార్‌ అని పిలుస్తారు. చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందినవారు ఏ వస్తువు కావాలన్నా చందుపట్లకు వచ్చేవారట.

ఎందరెందరో ప్రముఖులు…..
నాటినుండి నేటి వరకు చందుపట్ల గ్రామాన్ని ఎందరెందరో ప్రముఖులు సందర్శించారు. స్వామి రామానంద తీర్థ, వినోబా బావే, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, నీలం సంజీవరెడ్డి, వెదిరే రామచంద్రారెడ్డి, గవ్వ సోదరులు సందర్శించారు.1952-1961 మధ్య కాలంలో సర్పంచ్‌గా రాఘవాచార్యులు ఉన్నారు.
పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపనకు అప్పటి ముఖ్య మంత్రి బూర్గుల రామకష్ణారావు విచ్చేశారు. పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాకతీయుల కాలంనాటి రాసముద్రంలో పూడిక తీతకు రూ. 2.50 కోట్లు కేటాయించారు. ఆ కార్యక్రమానికి కెసిఆర్‌ హాజరై ఈ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి ప్రాముఖ్యత గల చందుపట్ల గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే అన్ని రంగాలలో అభివద్ధి చెందడంతో పాటు రుద్రమదేవి చరిత్ర తెలంగాణకు మణి మకుటంగా నిలుస్తుంది.

పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
చందుపట్లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. అరుదైన పాలనాదక్షురాలిగా.. అసమాన పరాక్రమశాలిగా పేరు గాంచిన దీరవనిత రుద్రమదేవి కాలు మోపిన నేలగా చందుపట్ల చరిత్రకు సాక్షిగా నిలుస్తుంది. ఆ చరిత్రను భావితరాలకు అందించాలి. గ్రామానికి ఎన్నో చారిత్రక విశేషాలు ఉన్నాయి. వాటిని భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రతి ఏటా రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

యరకల శాంతి కుమార్‌, 9849042083

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad