Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవిద్యార్థులపై పిడిగుద్దులు

విద్యార్థులపై పిడిగుద్దులు

- Advertisement -

– ఎస్‌ఎఫ్‌ఐ చలో విజయవాడపై పోలీసుల ఉక్కుపాదం
– పలువురు విద్యార్థినులకు గాయాలు

అమరావతి: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యలపై గొంతెత్తిన విద్యార్థులపై రాష్ట్రప్రభుత్వం పోలీసుల చేత పిడిగుద్దుల వర్షం కురిపించింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరిం చాలని కోరిన వారిపై కర్కశత్వం ప్రదర్శించి అరెస్టులు చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, జివో 77 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విజయ వాడలో లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్న విద్యార్థులు అక్కడి నుంచి అలంకార్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చౌక్‌లోనే ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు విద్యార్థులు బయలు దేరారు. ఈ నేపథ్యం లో విద్యార్థులను పోలీసులు అన్ని వైపుల నుంచి ముట్టడించి, ఎటూ వెళ్లనివ్వ కుండా బారికేడ్లతో నిర్బంధించారు. వాటిని ఛేదించుకుంటూ విద్యార్థులు క్యాంపు కార్యాలయం వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటపాటు ఆ ప్రాంతమంగా రణరంగంగా మారింది. దొరికిన వారి ని దొరికినట్లు పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ, ఈడ్చుకుంటూ పోలీస్‌ వ్యాన్‌లో ఎత్తిపడేశారు. విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాళ్లు,చేతులు మెలిపెట్టడంతోపాటు వారి చున్నీలను లాగేశారు. ఈ నేపథ్యంలో విశాఖప ట్నానికి చెందిన విద్యార్థిని కావ్య మోచేయి విరిగింది. విజయవాడకు చెందిన యశస్వి, ఉమా సొమ్మసిల్లి పడిపోయారు. సుమారు 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, వివిధ స్టేషన్లకు తరలించారు. వారిలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు పి రామ్మోహన్‌రావు, కె ప్రసన్నకుమార్‌, నాయకులు ఎల్‌జె నాయుడు, వెంకటేష్‌, రవి, పవిత్ర, జ్యోతి, సమీరా, రాజా తదితరులున్నారు.
విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని పిడిఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అంతకుముందు జరిగిన ధర్నాలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యారంగంలో చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, పి రామ్మోహన్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.6400 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు శిథిలావస్థలో ఉన్నాయని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో విసిలు, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని పేర్కొన్నారు. ఎయిడెడ్‌ వ్యవస్థకు గుదిబండగా ఉన్న 35, 36, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
విద్యార్థులను పరామర్శించిన సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు
పోలీసుల దాడిలో గాయపడ్డ విద్యార్థులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పరామర్శించారు. సింగ్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావ్య, యశస్వి, ఉమాలను వారు పరామర్శించారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, విద్యార్థినుల పట్ల అమానుషంగా వ్యవహరిం చడం, పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధిం చడాన్ని వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు ఆస్పత్రిలో చేర్చేందుకు కూడా తాత్సారం చేసి నిర్దయగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేసి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, నాయకులు రమణ, సత్యబాబు తదితరులు విద్యార్థులను పరామర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad