Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీహార్‌లో బీజేపీకి వ్యతిరేక పవనాలు

బీహార్‌లో బీజేపీకి వ్యతిరేక పవనాలు

- Advertisement -
  • సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయకపోతే.. బీఆర్‌ఎస్‌ బీజేపీకి మధ్య అవగాహన ఉన్నట్టే.. : విలేకర్ల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీహార్‌లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తొమ్మిదేండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించిందని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌ను సంస్కరించాలని డిమాండ్‌ చేశారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉందని అనుకునే పరిస్థితి వస్తుందన్నారు. వివిధ రాష్ట్ర్రాల్లోని రాజకీయ పార్టీలకు బీజేపీ ఒక భస్మాసూర హస్తంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎప్పుడైతే బీజేపీ పంచన చేరిందో ఆ పార్టీ కొంప కొల్లేరయిందని చెప్పారు. చివరకు కవిత బయటికి వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల 21 నుంచి 25 వరకు పంజాబ్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయనీ, ఈ సభలో జాతీయ రాజకీయ, ఇతర పలు అంశాలపై చర్చించనున్నట్టు వివరించారు. కూనంనేని మాట్లాడుతూ గత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తి అని వెంకయ్యనాయుడుకు మద్దతిచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగువ్యక్తి, తెలంగాణ బిడ్డ, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి ఓటు వేస్తారా?, లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలు గర్వించదగ్గ నాయకుడు రావి నారాయణ రెడ్డి
ప్రజలు గర్వించదగ్గ నాయకుడు రావి నారాయణ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావినారాయణ రెడ్డి 34వ వర్థంతి సందర్భంగా మఖ్దూం భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. నిజాం రాచరికానికీ, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆంధ్ర మహాసభలో చేరారని చెప్పారు. ఆంధ్ర మహాసభకు రెండుసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన రావి నారాయణ రెడ్డి దొరల భూస్వాముల ఎదిరించాలంటే సాయుధ పోరాటమే పరిష్కారమని మఖ్దూం,బద్దం ఎల్లారెడ్డి లతో కలిసి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని చెప్పారు. వేలాది గ్రామాలను విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచారన్నారు. కార్యక్రమంలో ఈటీ నర్సింహ, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad