Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపోరాడి సాధించుకున్న ఉద్యోగానికి 'రెన్యువల్‌' అవరోధం

పోరాడి సాధించుకున్న ఉద్యోగానికి ‘రెన్యువల్‌’ అవరోధం

- Advertisement -
  • నాలుగు నెలలుగా వేతనాల్లేక అవస్థలు
  • రెన్యువల్‌ కాలేదని నిలిపివేత
  • 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల కుటుంబాల విలవిల

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
పరీక్షలో ఉత్తీర్ణులైనా ఉద్యోగ పోస్టు ఇవ్వకపోవడంతో ఏండ్ల తరబడి పోరాటం చేసి ఉద్యోగం సాధించుకుంటే.. రెన్యువల్‌ కాలేదంటూ వారికి నాలుగు నెలలుగా అధికారులు జీతాలు నిలిపేశారు. 2008 నుంచి 2025 ఫిబ్రవరి ఉద్యోగం వచ్చే వరకూ 2008 డీఎస్సీ అభ్యర్థులు సీఎం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యా కమిషనర్ల దాక కలవని వారంటూ లేరు. అనేక ఆందోళనలు, విజ్ఞప్తులు, పోరాటాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఒప్పందం ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అవకాశం ఇచ్చారు. ఉద్యోగంలో చేరినా వారికి కష్టాలు తప్పడం లేదు. రెన్యువల్స్‌ చేయలేదన్న కారణం చూపి నాలుగు నెలలుగా అధికారులు వేతనాలు ఇవ్వకుండా నిలిపేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్న 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నాలుగు నెలలు కావస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 1225 మంది ఎస్‌జీటి ఉపాధ్యాయులను ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఒప్పందం ప్రాతిపదికన.. జీఓ నెం.14 ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. వారితో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనులు చేయించుకుంటూ.. వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు. రోజు వారీ ఖర్చులు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, వైద్యం కోసం అవస్థలు పడుతున్నారు. స్నేహితులు, బంధువులు దగ్గర అప్పులు చేసే దుస్థితి నెలకొన్నది.

సుదీర్ఘపోరాటం తర్వాత
తెలంగాణలో 2008 డీఎస్సీ తర్వాత ఉద్యోగం కోసం అభ్యర్థులు సుదీర్ఘ పోరాటం చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాల మెరకు 2025 ఫిబ్రవరిలో వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు నిర్వహిస్తున్నా వేతనాల చెల్లింపు విషయంలో వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఒకవైపు కోర్టుల చుట్టూ తిరుగుతూనే.. మరోవైపు ఉద్యమాలు చేశారు. ఇప్పుడు వేతనాల కోసం ఉద్యమం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులు చేసి ఇంటిని గడుపుతున్న తమను వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. బడి బాట కార్యక్రమాలు మొదలుకొని నిర్వహణ బాధ్యత మొత్తం చూస్తున్నా.. రెన్యు వల్‌ పేరుతో వేతనాలు ఇవ్వకపోవడం సరికాదంటున్నారు.

వేతనాలకు అడ్డంకిగా మారిన రెన్యువల్‌
2025 -26 విద్యాసంవత్సరం కోసం రెన్యువల్‌ చేయలేదన్న కారణం చూపి ఎస్‌టీఓ, డీటిఓ వేతనాలు ఇవ్వడం లేదు. ఒప్పందం విధానంలో పనిచేస్తున్న వీరికి రెన్యువల్‌ గుదిబండగా మారింది. పెద్దకొత్తపల్లి, కోడేర్‌ మండలాల పరిధిలో పనిచేస్తున్న వారికి మార్చిలో చెల్లించాల్సిన వేతనం సెప్టెంబర్‌ 2న పడింది. మిగాతా నెలలకు డీటీఓ, డీఈఓలు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేతనాల్లో వివక్ష
2008 డీఎస్సీ రాసి 14 ఏండ్లపాటు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డాం. అనేక పోరాటాల ద్వారా ఉద్యోగం సాధించుకుని.. ఇకపై ప్రశాంతమైన జీవితం ఉంటుందని అనుకున్నాను. కానీ వేతనాల విషయంలో వివక్ష చూపుతున్నారు. 4 నెలల నుంచి వేతనాల్లేక ఉప్పిడి ఉపవాసంతో కాలం గడుపుతున్నాం
-నరేష్‌, ఉపాధ్యాయులు, రేవల్లి మండలం, వనపర్తి జిల్లా

మేమెలా బతకాలి?
ఒక నెల జీతం రాకుంటేనే ఇల్లు గడవడం కష్టం. అలాంటిది నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం మా పట్ల వివక్ష చూపుతోంది. ఇలా అయితే కుటుంబాలు బతికేది ఎలా?
-రాజశేఖర్‌, యాదిరెడ్డిపల్లి, తాడూరు మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

రెన్యువల్‌ ఎందుకు ?
అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మేము డీఎస్సీ రాసి ఉద్యోగంలో చేరాం. ఎవరికీ లేని రెన్యువల్‌ మాకెందుకు? ఎస్‌టీఓ ద్వారా నేరుగా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అందరిలాగే విధులు నిర్వహిస్తున్న మా పట్ల ఇలా వివక్ష చూపడం సరికాదు. నెలనెలా వేతనాలు ఇవ్వాలి.
-ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, తాడూరు మండలం, నాగర్‌కర్నూల

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad