- అధికారులు,సిబ్బందికి మేయర్, కమిషనర్ అభినందన
- విధుల్లో పారిశుధ్య కార్మికురాలు, కానిస్టేబుల్ మృతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ ,సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్, కమిషనర్ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకూ గ్రేటర్ వ్యాప్తంగా 2.70 లక్షల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణేష్ ప్రతిమలు నిమజ్జనమైన నేపథ్యంలో మేయర్, కమిషనర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందించారు. పారిశుద్ధ్యం, విద్యుత్, టాయిలెట్లు, క్రేన్‌ల ఏర్పాటు తదితర అంశాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్ యాక్షన్ టీమ్స్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టాయని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించిందని తెలిపారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్‌లతో సహా నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల మేర మార్గంలో మరమ్మతులు చేపట్టడంతో ఊరేగింపు సురక్షితంగా జరిగిందన్నారు. 15వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు మూడు షిఫ్టులో విధులు నిర్వర్తించడంతో ఎక్కడా ఇబ్బందులు కనిపించలేదని తెలిపారు. ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా 72 కృత్రిమ కొలనులతో నిమజ్జనం అయ్యేలా చూడగలిగామన్నారు. జీహెచ్‌ఎంసీ కల్పించిన ఉచిత భోజన సౌకర్యానికి భక్తులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. అలాగే, వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11,200 టన్నులకు పైగా వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సేకరించిందని తెలిపారు. అలా సేకరించిన వ్యర్థాలను జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. కాగా, వినాయక చవితి ఉత్సవం, మహా నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా సహకరించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి
బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. సత్వర వైద్య చికిత్స కోసం జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ సమీపంలోని హైదరాబాద్ నర్సింగ్ హౌమ్‌కు తరలించారు. అప్పటికే పారిశుధ్య కార్మికురాలు రేణుక మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఘటనపై ఆరా తీశారు. పారిశుధ్య కార్మికురాలు రేణుక మృతిపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామనీ హామీచ్చారు.
వినాయకుడి ఊరేగింపులో కానిస్టేబుల్ మృతి
వినాయకుడి ఊరేగింపులో గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె.డేవిడ్(31) అనే కానిస్టేబుల్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న ఆయన.. నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను వెంటనే ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.
40 అడుగుల గణేష్ విగ్రహాలు పెరగడంతో శోభాయాత్ర ఆలస్యం : సీపీ సీవీ ఆనంద్
నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర దాదాపు 40 గంటల పాటు కొనసాగిందనీ, ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల శోభాయాత్ర కొంత ఆలస్యమైందని డీజీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జనం రెండవ రోజు ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై మీడియాతో మాట్లాడారు. మూడవ రోజు నుంచి 11వ రోజు వరకు మొత్తం 1.40లక్షల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారనీ, ఇందులో 1.20లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనమయ్యాయన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా పనిచేశారనీ, 9 డ్రోన్లు, 35 హై-రైజ్ భవనాలపై కెమెరాలను ఉపయోగించి నిఘా పెట్టామని తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో నిమజ్జనం ముందుగానే పూర్తయిందనీ, తమ సెంట్రల్ జోన్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీఏ, హెచ్‌ఎండీఏ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం వల్ల నిమజ్జనం విజయవంతమైందని తెలిపారు. నిమజ్జన ఊరేగింపులో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోద య్యాయనీ, అలాగే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పోలీసులు పట్టుకున్నారని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య తగ్గిందని వివరించారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావర ణంలో జరిగినందుకు ప్రజలకు, గణేశ్ ఉత్సవ సమితి వారికి, మండప నిర్వాహ కులకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 40 గంటల పాటు అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బంది, అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీజీ ఐసీసీసీ మల్టీ ఏజెన్సీ వార్ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ, సమస్యలను పరిష్కరించి, నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులకు సహకరించారని, అందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషినల్ సీపీ లా ఆండ్ ఆర్డర్ విక్రం సింగ్ మాన్, క్రైమ్ అడిషినల్ సీపీ పి.విశ్వప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డెవిస్, డీసీపీ డీడీ ఎన్.శ్వేత, సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పావల్లి, కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.