నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్. తల్లిదండ్రులు శకుంతలాదేవి, రామచందర్‌రావు. భర్త దివంగత వేముల దేవేందర్. రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. ఈమె ఆంధ్రా బ్యాంకులో పనిచేసి సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగవిరమణ పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకూ మధ్య, చినుకులు, తల్లివేరు, అశ్రువర్షం, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు, నానీలు రాశారు. ‘రమ’ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. 2004లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవిని వరించాయి.