- Advertisement -
- ఇకపై స్వదేశంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి
- వలసేతర వీసాలకు కొత్త రూల్ తీసుకొచ్చిన యూఎస్
- తక్షణమే అమల్లోకి
- భారతీయులకు తప్పని ఇబ్బందులు
న్యూఢిల్లీ : వీసాల విషయంలో అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వలసేతర వీసా దరఖాస్తుదారులకు షాకిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమం ప్రకారం దరఖాస్తుదారులు వారి స్వంత దేశంలో లేదా చట్టపరంగా నివాసముంటున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీ మార్పునకు సంబంధించి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటనను చేసింది. ఈ రూల్ వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాల్లో ఉన్నవారికి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజా నిబంధనతో పాటు భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వలసేతర వీసా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈ వీసాల కోసం ఇకపై ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలను వ్యాపార, పర్యాటక, విద్య, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులను పెండ్లి చేసుకోవడం వంటి వాటికి ఇస్తుంటారు. అయితే తాజా నిర్ణయంతో యూఎస్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్‌ఐవీ)కి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఇకపై వేరే దేశం నుంచి వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోలేరు. ఈ వీసాలను పొందటానికి స్వంత దేశం నుంచి ఎక్కువ సమయం పడుతుందన్న కారణంతో చాలా మంది ప్రయాణికులు, ప్రత్యేకించి భారతీయులు ఇతర దేశాల నుంచి దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లకు షెడ్యూల్ చేసుకుంటారు. అయితే ఎన్‌ఐవీ ఇంటర్వ్యూలకు దరఖాస్తుదారులు పౌరసత్వం కలిగి ఉన్న దేశం నుంచి లేదా చట్టపరమైన నివాసముంటున్న దేశం నుంచి షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుందని యూఎస్ తీసుకొచ్చిన కొత్త రూల్.. వారికి ఇబ్బందులను తీసుకురానున్నది.
ఈ నిబంధన టూరిజం (బీ-2), వ్యాపారం(బీ-1), విద్యార్థులు, తాత్కాలిక కార్మికులతో పాటు అన్ని వలసేతర వీసా విభాగాలకు వర్తించనున్నదని తన నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. కాబట్టి ఇకపై బయటి దేశాల నుంచి ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసుకునేవారు వీసాను పొందే విషయంలో భారీ ఇబ్బందులను ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సందర్భాలలో దరఖాస్తు రుసుము రీఫండ్, ట్రాన్స్‌ఫర్‌కు అవకాశముండదని సదరు విభాగం స్పష్టం చేసింది. అపాయింట్‌మెంట్ సమయం ప్రదేశాన్ని బట్టి మారుతుంటుందని వివరించింది.
భారతీయులకు ఇబ్బందులే
అమెరికా తీసుకొచ్చిన ఈ కొత్త నియమంతో భారతీయ వ్యాపారులు, పర్యాటకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఎన్‌ఐవీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ దరఖాస్తుదారులు ఇకపై భారత్ వెలుపల లేదా వారి చట్టపరమైన నివాసం కాకుండా త్వరిత బీ1 (వ్యాపారం) లేదా బీ2 (పర్యాటక) అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోలేరు. సాధారణంగా భారతీయ నగరాల్లో యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం మూడు నుంచి తొమ్మిది నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ సమయం కావటంతో భారతీయులు చాలా మంది ఇలాంటి యూఎస్ వీసా ఇంటర్యూలను బుక్ చేసుకోవడానికి జర్మనీ, బ్రెజిల్, దుబారు, సింగపూర్, థాయిలాండ్‌లకు వెళ్తారు. ఫలితంగా వారికి 10-15 రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ దక్కుతుంది. భారతీయులు చాలా కాలంగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ట్రెండ్ సర్వసాధారణమైపోయింది. అయితే కొత్త నిబంధనతో ఈ వెసులుబాటు దూరం కానున్నది. యూఎస్ తీసుకొచ్చిన కొత్త మార్పుతో దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం వేచి ఉండే సమయం పెరగనున్నది.
- Advertisement -