చేరికలపై దూకుడే.!
పార్టీని వీడిన వారికి ఆహ్వానం
పార్టీని మూడు క్యాటగిరీలుగా అభివృద్ధి చేయాలి
నెలాఖరులో గ్రామ, మండల కమిటీల ఏర్పాటు
వారం రోజుల్లో డీసీసీల నియామకం
బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోవాలి
కామారెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించింది. ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఘర్ వాపసీ పేరిట కాంగ్రెస్‌లో చేర్చుకోవాలనీ, బీఆర్‌ఎస్ నుంచి వచ్చే విషయంలో మరింత స్పీడ్‌గా వ్యవహరించాలని సూచించింది. రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో నాయకత్వం క్రియాశీలకంగా ఉండాలనీ, ముఖ్యంగా చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా పార్టీని వీడిన నాయకులకు తిరిగి రావాలని ఆహ్వానించింది. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారంరోజుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులో గ్రామ, మండల కాంగ్రెస్ అధ్యక్షులను నియమించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అన్ని స్థాయిలో నాయకులు కృషి చేయాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీ నిర్మాణం బలంగా ఉండాల్సిన అవసరముందని సూచించింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని క్యాడర్‌ను ఆదేశించింది. పార్టీని మూడు క్యాటగిరీలుగా అభివృద్ధి చేయాలని సూచించింది. అందుకోసం ఇప్పటికే కో ఆర్డినేటర్లను నియమించినట్టు తెలిపింది. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 15న కామారెడ్డిలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సమావేశం ఆయనకు అభినందనలు తెలిపింది.
అన్ని వర్గాల నాయకులు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి
కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు చెందిన నాయకులు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు.లక్ష మందితో కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఓట్ చోరీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారనీ, ఆయనకు అండగా ఉండాలని చెప్పారు. పదవే పరమావధిగా భావించే మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీని కారణంగానే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారని చెప్పారు. బీజేపీ నాయకులకు ఎన్నికలు వస్తే దేవుడు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరుకుమార్ దేవుళ్ళ పేరు చెప్పి గెలిచారని విమర్శించారు. దేవుళ్ళకు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. 2029లో మోడీకి పరాభవం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఖేల్ ఖతమని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రకటనతో కేసీఆర్ కుటుంబం దోపిడీ బట్ట బయలైందని తెలిపారు. కార్లలో డీజిల్ పోసుకోలేని కేసీఆర్ కుటుంబం…అవినీతి సొమ్ముతో వేల కోట్లకు పడగలెత్తిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
బీఆర్‌ఎస్ చేసిన తప్పిందాలతో ఆ పార్టీ మునుగుతోంది ఎన్ని ముక్కలవుతుందో తెలియని పరిస్థితి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పిందాలతో ఆ పార్టీ మునుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్ని ముక్కలవుతుందో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న వారిని ఉద్యమంలా చేర్చుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవుల్లో ఏదో ఒకటి తప్పకుండా వస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పెట్టిందనీ, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసిందని గుర్తు చేశారు. ఆ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి దించడం సాధ్యమయ్యే పని కాదని కొంత మంది ఆనాడు అన్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి ఆపార్టీని దించారని కొనియాడారు. పీసీసీ అధ్యక్షునిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, క్యాబినెట్ తరుపున అభినందనలు తెలిపారు. ఇంట్లో దోపిడీ దొంగలు పడి పెద్ద ఎత్తున దోచుకుపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో టీఆర్‌ఎస్ పరిపాలన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పారు. శాస్త్రీయంగా కుల గణన చేపట్టామన్నారు. దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్తకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీి, జెడ్పీ చైర్మెన్ ఏదో ఒక పదవి వస్తోందన్నారు. ఆ అవకాశం రాని వారికి పార్టీ పరంగా అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సమాచారం పీసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వద్ద ఉన్నాయన్నారు. దశాబ్ద కాలంపాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనీ, ఆ విజయగర్వంతో కామారెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
ప్రతి కమిటీలో సామాజిక న్యాయం పాటిస్తాం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించడం శుభ పరిణామమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. వచ్చే విస్తృతస్థాయి సమావేశాలను ఆయా జిల్లాలో నిర్వహించేలా ప్లాన్ చేస్తామన్నారు. ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్‌కు అనుగుణంగా ఎంపికచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో 70 నుంచి 80 శాతం పాత వారికి పదవులు ఇచ్చామన్నారు. మిగిలిన 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పించామని చెప్పారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కష్టతరమైన సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీ యోచిస్తోందని తెలిపారు. రేవంత్ ఓసీ అయినప్పటికీ, బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళుతున్నారని కొనియాడారు. 90 శాతం ప్రజలకి ప్రభుత్వ పథకాల లబ్ధి జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై పూర్తిగా దృష్టిసారిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.