- బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ పెద్దలు : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే దసరా తర్వాత పోరాటాలకు పురిటిగడ్డ భువనగిరిలో లక్షల మందితో ‘బీసీల రాజకీయ యుద్ధభేరి’ మహాసభ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. బీసీల రాజకీయ శక్తిని ప్రదర్శించి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 22 నెలలుగా బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారని, ఇంకొక వైపు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు రిజర్వేషన్లు పెంచకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలు వాటి ఆమోదం కోసం చివరి వరకు కృషి చేయడం లేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్‌లోనే ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ శక్తిని చాటేందుకు పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు పదవులు కాదు, వ్యవస్థాగతంగా 42 శాతం రిజర్వేషన్లు అవసరమని వక్తలు స్పష్టం చేశారు. జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్‌చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీసీ విద్యావంతుల వేదిక ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన అధ్యక్షులు కనకాల శ్యాం, కల్చరల్ ఫోరం అధ్యక్షులు వరంగల్ శ్రీనివాసులు, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మని మంజరి, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్‌గౌడ్, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కౌల్లె జగన్నాథం పాల్గొన్నారు.