- Advertisement -
- వృద్ధి 0.6 శాతం వరకు తగ్గొచ్చు
- దీర్ఘకాలం కొనసాగితే మరింత కష్టమే
- సిఇఎ అనంత నాగేశ్వరన్ వెల్లడి
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై విధించిన అధిక టారిఫ్‌లు దేశ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్‌లు దేశ జిడిపిని 0.5 శాతం ఉంచి 0.6 శాతం వరకు తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) వి అనంత నాగేశ్వరన్ అన్నారు. ఈ అదనపు టారిఫ్‌లు తాత్కాలికమైనవి అని భావిస్తున్నానని చెప్పారు. సోమవారం బ్లూమ్‌బర్గ్ టివికి ఇచ్చిన ఇంటర్యూలో నాగేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ టారిఫ్‌లు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై ఆధారపడి జిడిపిలో మార్పులు ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపిపై 0.5 శాతం నుంచి 0.6 శాతం వరకు ప్రభావం పడొచ్చన్నారు.
తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ ఈ టారిఫ్‌ల అనిశ్చితి కొనసాగితే ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని నాగేశ్వరన్ హెచ్చరించారు. భారత్‌కు తీవ్ర ప్రమాదంగా మారవచ్చని అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును సాకుగా చూపి భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలను విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ టారిఫ్‌లతో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి పోటీదారులతోనూ భారత ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది.
గడిచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత జిడిపి 7.8 శాతం వృద్ధిని సాధించిన నేపథ్యంలో 2025-26లో జిడిపి 6.3-6.8 శాతంగా ఉండొచ్చని నాగేశ్వరన్ అంచనా వేశారు. ఇది గతేడాది కంటే ఎక్కువ వృద్ధి అన్నారు.
జిడిపి శ్లాబుల్లో కోతలు, ఎనిమిదేళ్లలో అత్యల్ప ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఉన్నాయన్నారు. ఇవి ప్రజల ఆదాయాల మెరుగుదలకు మద్దతును ఇవ్వడంతో పాటుగా ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతాయన్నారు. రోజువారీ వినియోగ వస్తువులపై జిఎస్‌టి రేట్లను తగ్గించడం ద్వారా డిమాండ్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు జిడిపిని 0.2 శాతం నుంచి 0.3 శాతం మేర పెంచవచ్చన్నారు.
- Advertisement -