గుత్తికోయల ఆవేదన
శాంతినగర్‌లో శాంతియుత చర్చలు
సమస్య పరిష్కారానికి పోలీసులు, సీపీఐ(ఎం) నాయకుల చొరవ
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి-మంగపేట గ్రామాల మధ్య అడవిలోని శాంతినగర్‌లో గుత్తి కోయలు వేసుకున్న గుడిసెలను ఈ నెల 4వ తేదీన ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి తొలగించారు. గుత్తికోయల సమస్యలను పరిష్కరిం చడానికి సోమవారం స్థానిక ఎస్‌ఐ టీవీఆర్ సూరి, సీపీఐ(ఎం) నాయకులు ఎన్‌ఎస్ ప్రసాద్, ఎల్పీ ముత్యాలు దావూద్ చొరవ చూపి ఫారెస్ట్ అధికారులు గుత్తి కోయ ప్రజల మధ్య శాంతియుత సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాము నివాసం ఉంటున్న ఇండ్లలో ఊట వచ్చి నివాసానికి యోగ్యంగా లేకుండా పోయాయని గుత్తి కోయ గూడెం పెద్ద మంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అడవికి భంగం కలిగించకుండా తాము గతంలో చేసిన పోడులోనే గుడిసెలు వేశామని, కొత్తగా పోడు చేయలేదని వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు తాము నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వేడుకు న్నారు. డీఆర్‌ఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. 2012లో ఈ ప్రాంతంలో కేవలం మూడు గుడిసెలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు సుమారు 18 గుడిసెలు వేసుకున్నారని అన్నారు.
వీరి నివాసాల విషయంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారికి ఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు వినతిపత్రాలను ఇవ్వాలని గుత్తి కోయలకు సూచించారు. అడవిని నరికి నివాసాలు వేసుకుంటామంటే ఉండమని చెప్పడానికి తమకు ఎలాంటి హక్కులు లేవని, తమ విధి నిర్వహణను చేసుకుంటూ వెళ్ళకతప్పదని అన్నారు. గుత్తి కోయలు కొత్తగా గుడిసెలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వలేమని, ఈ విషయంలో రేంజర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రేంజర్ అందుబాటులో లేరని, వారు వచ్చాక ఈ విషయంపై చర్చించాలని సీపీఐ(ఎం) నాయకులకు సూచించారు. ఎస్‌ఐ టీవీఆర్ సూరి, సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా శాంతినగర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న గుత్తికోయల పట్ల మానవత్వ కోణంలో ఆలోచించాలని అటవీ అధికారులను కోరారు. అటవీ అధికారుల మాటలను ఉల్లంఘించి పోడు చేయవద్దని శాంతినగర్ గుత్తి కోయలకు తెలిపారు.
ఊట ప్రదేశంలో ఉండేదెలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES