నవతెలంగాణ-హైదరాబాద్: సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ నేపాల్ పార్లమెంట్ చట్టం చేసిన విషయం తెలిసిందే. ఆదేశ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదేశ ఎంపీల ఇండ్లతో పాటు పార్లమెంట్ ఎదుట నిరసనకారులు భారీ నిరసన తెలిపారు. పలు వీధుల గుండా భారీగా బయలు దేరి ఎంపీల ఇండ్లను చుట్టు ముట్టారు.
ఇవాళ కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తక్షణమే కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రుల ఇళ్లను ముట్టడించి తగలబెట్టారు. అధ్యక్షుడి భవనంలోకి చొరబడి నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఫొటోలు, వస్తువులను పగలగొట్టారు. అలాగే మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు చేశారు. దీంతో ప్రధాని ఓలి శర్మతోపాటు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేశారు.
ఈక్రమంలో నేపాల్‌లో ఉద్రిక్తత పరిస్థితుల రీత్యా ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి తాత్కాలికంగా ఎయిర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.