తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోనే స్వేచ్ఛ, ఎన్నో ప్రజావిజయాలు
నిజాం.., ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కటే..బలవంతంగా ఏ భాషనూ రుద్దొద్దు
భువనగిరి సదస్సులో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-భువనగిరి
”భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం నాడు తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటం ద్వారా ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛను పొందారు.. ఎన్నో ప్రజావిజయాలు సాధించారు.. కానీ నేడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆ పోరాట వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.. అలా చేస్తే తిరుగుబాటు తప్పదు..” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దివ్య ఫంక్షన్‌హాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ అధ్యక్షతన ‘వీరతెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటం.. ప్రజా విజయాలు, వాస్తవాలు, వక్రీకరణలు’ అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. తెలంగాణ సాయుధ విప్లవ పోరాటంలో ఎందరో మహానుభావులు అసమాన ధైర్యసాహసాలు, తాగాలు చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు నేడు కొంతైనా మెరుగైన జీవితం గడుపుతున్నారంటే నాటి ఆ పోరాటమే కారణమని చెప్పారు.
నిజాంకు జమీందారులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్, పటేళ్లు, పట్వారీలు ఊడిగం చేశారన్నారు. వీరి దౌర్జన్యాలు పరాకాష్టకు చేరడం వల్లే తెలంగాణ సాయుధ పోరాటం ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం వీరంతా లేకున్నా చిన్న స్థాయి జమీందారులు మాత్రం ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వెనుక 4000 మంది సాయుధ పోరాట అమరవీరుల రక్తంతో తడిసిన త్యాగాలు ఉన్నాయన్నారు. నాటి నిజాం, నేటి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఫాసిస్ట్ విధానాలు ఒక్కటేనని వివరించారు. అప్పట్లో కమ్యూనిస్టులు ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా గ్రామాల్లో రాత్రి పూట వయోజన పాఠశాలలు నడిపారని గుర్తు చేశారు. ఎందరో కళాకారులు సుద్దాల హనుమంతు, దాశరథి, సినారె లాంటివారు ఉద్యమాలలో పాలుపంచుకున్నారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లిం వివాదంగా మార్చడానికి యత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ రైతాంగ పోరాట వీరుల త్యాగాన్ని వృథా కానివ్వొద్దన్నారు.
దేశంలో పాలకులు ఓటర్ లిస్ట్‌లను తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలు, ఆడవారు, తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పేర్లు తీసేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, లంచం, కులం, మతం పేరిట గెలవాలని చూస్తున్నారని వివరించారు. కానీ నేటికీ దేశం ఐక్యతగా ఉండటానికి కారణం ఫెడరల్ వ్యవస్థ అని, అలాంటి ఫెడరల్ వ్యవస్థను కాలరాస్తున్నారని తెలిపారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశవిచ్ఛిన్నానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో తీసుకుంటున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇటీవల ప్రధాని మోడీ ఆడవారు ఇంటికే సేవలు అధికంగా చేయాలనడం ఆయనలో ఉన్న ఫాసిస్టు విధానాలకు తార్కాణమన్నారు. చైనాలో వందమంది మహిళల్లో డెబ్బై మంది దేశ అభివృద్ధిలో.. కుటుంబ పోషణతోపాటు ఆర్థికంగా సంపాదించే బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. మన దేశంలో 14 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, నిజాంపై పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర లేదన్నారు. తెలంగాణ చరిత్రను, అమరుల త్యాగాలను చదవాలని సూచించారు. కేంద్రానికి భయపడితేనో లేక పుష్పగుచ్ఛాలు, శాలువాలతో మచ్చిక చేసుకుంటేనో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జి.శ్రీనివాస్‌చారి, నాయకులు గూడూరు అంజిరెడ్డి, మాయకృష్ణ పాల్గొన్నారు.