Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

- Advertisement -

ఎన్డీఏ అభ్యర్థికి 452 ఓట్లు, ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ అభ్యర్థి అయిన ఆయనకు 452 ఓట్లు రాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్‌ గెలుపొందారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని వసుధ రూమ్‌ నెంబర్‌ ఎఫ్‌ 101లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభానేత జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, ఎన్సీపీ ఎంపీ శరద్‌పవర్‌, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, కె. రాధాకృష్ణన్‌, అమ్రారామ్‌, ఎస్‌.వెంకటేషన్‌, కేంద్ర మంత్రులతో సహా వివిధ పార్టీలకు చెందిన 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పీసీ మోడీ ఫలితాలను వెల్లడించారు. మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 98.2 శాతం ఓట్లు పోలయ్యాయని అన్నారు. అందులో 752 ఓట్లు చెల్లుబాటు కాగా, 15 ఓట్లు చెల్లనివిగా పీసీ మోడీ తెలిపారు. ఎంపీ ఓటు వేయడానికి నిరాకరించడంతో ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ రద్దు చేసినట్టు పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌కు మొదటి ప్రాధాన్యత ఓట్లు 452 రాగా, బి. సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయని తెలిపారు. దేశ ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామని పీసీ మోడీ తెలిపారు.

రాధాకృష్ణన్‌కు పలువురు అభినందనలు
దేశ 17వ ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన సీపీ రాధాకృష్ణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ సంప్రదాయాలను రాధాకృష్ణన్‌ కాపాడతారని, ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నానని ఖర్గే అన్నారు.

సీపీ రాధాకృష్ణన్‌ జీవిత నేపథ్యం
సీపీ రాధాకృష్ణన్‌ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్‌ 20న జన్మించారు. 1974లో జనసంఫ్‌ు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడయ్యారు. గతంలో రెండు సార్లు (1998, 1999) కోయంబత్తూరు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయన 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ 2024 మార్చి 18న రాజీనామా చేయడం తో తెలంగాణ గవర్నర్‌ (అదనపు బాధ్యతలు)గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తెలంగాణ గవర్నర్‌గా 2024 జులై 31 వరకు, పుదుచ్చేరి గవర్నర్‌గా 2024 ఆగస్టు 6 వరకు పని చేశారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయిర్‌ బోర్డు చైర్మెన్‌గా పని చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad