నవతెలంగాణ-హైదరాబాద్: ఓ యువతి కొత్త కారు కొన్న ఆనందం క్షణ్ణాల్లోనే ఆవిరైపోయింది. అందురూ చూస్తుండగానే షోరూమ్ రెండో అంతస్తు నుంచి కారు బోల్తా పడింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఘజియాబాద్‌కు చెందిన 29 ఏళ్ల మాని పవార్ అనే మహిళ.. తన భర్త ప్రదీప్‌తో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లోని కారు షోరూమ్‌కు సోమవారం సాయంత్రం 5గంటలకు వచ్చింది. అనంతరం రూ.27 లక్షల ఖరీదైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేసింది. అయితే షోరూమ్ లోపలే పూజ నిర్వహించింది. అనంతరం టైర్ నిమ్మకాయ తొక్కించడానికి డ్రైవింగ్ సీటులో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ మీద కాలు వేసి బలంగా తొక్కింది. అంతే వెంటనే గాజు గోడను దూసుకుని కింద పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి తల్లకిందులుగా కారు పడిపోయింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం సమీపంలోని మాలిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అభిషేక్ ధనియా తెలిపారు.
అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి తప్పులు మరొకరు చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.