ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో నివాళులు అర్పించిన నేతలు
నవతెలంగాణ అచ్చంపేట: భూమి భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడుతూ ఐలమ్మ పొలానికి పోయి, అక్కడ మాటువేసి, పంటకోసేందుకు వచ్చిన దేశ్‌ముఖ్ గూండాల మీద కొడవళ్లు, కర్రలతో దాడిచేసి వారిని నిలువరించారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు కోసి కట్టలు కట్టిన పంటను ఐలమ్మ ఇంటికి చేర్చారు. దొర గుండాలు ఐలమ్మ ఇంటిపై దాడిచేయగా, ఆమె రోకలి బండను చేతబుచ్చుకుని వారిపై తిరగబడ్డారని ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేశారు.
దీంతో మరోసారి పరాభవానికి గురైన దేశ్‌ముఖ్ ఐలమ్మ కుటుంబీకులను, సూర్యాపేట నుంచి వచ్చిన ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అరెస్టు చేయించి, చిత్రహింసలకు గురిచేసినారు. ఐలమ్మ ఆంధ్రమహాసభ వెంట నిలిచిందన్నారు. నాడు ఐలమ్మ సాధించిన ఈ విజయం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నిజాం వ్యతిరేకుల్లో గొప్ప స్ఫూర్తిని నింపి హైదరాబాద్ సంస్థానం విముక్తికి బాటలు పరిచిందన్నారు. నాటి పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తన పుస్తకంగా వివరంగా ప్రస్తావించగా, కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తన జీవిత చరిత్ర ‘విప్లవ పథంలో నా పయనం’లోనూ ప్రస్తావించారు.
నిజాంకు వ్యతిరేకంగా ఇంత పెద్ద పోరాటం చేసిన ఐలమ్మకు తర్వాత వచ్చిన ప్రభుత్వాల నుంచి ఎలాంటి గుర్తింపూ దక్కలేదు. చివరికి.. స్వాతంత్య్ర సమరయోధుల ఫించన్‌కూ ఆమె నోచుకోలేదన్నారు. ఒక సాధారణ రైతుగా, అత్యంత సామాన్య జీవితం గడిపిన ఐలమ్మ 1985 సెప్టెంబరు 10న తన 90వ ఏట కన్నుమూశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అంతటి రజిత మల్లేష్,. ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్అ రెడ్డి, ఎంపిపి రామనాథం, కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు, బీసీ సంఘం కాశన్న యాదవ్, మహబూబ్ ఆలీ, రజక సేవా సంఘం నాయకులు భోగరాజు అశోక్, కేతపల్లి వెంకటేష్ లు ఉన్నారు.