ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు
నవతెలంగాణ – హైదరాబాద్: ఆత్మహత్యలు కాదు..ఆశలకు జీవం పోయండని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 10, బుధవారం లయన్స్ క్లబ్ 320ఎ, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చిక్కడపల్లి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో విద్యార్థినుల కోసం ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
లియో చైర్ పర్సన్ జి.కృష్ణవేణి, క్లబ్ సెక్రటరీ జి.లక్ష్మీ, పిపిఎఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రఘు ఆధ్వర్యంలో “చదువు ఆత్మహత్యలు” అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు చదువు ఒత్తిడి, ఫలితాల భయం, కుటుంబ, సామాజిక అంచనాలు వంటి అంశాలను లోతుగా పరిశీలించారు.
విజేతలకు బహుమతులను, వ్యక్తిత్వ వికాసం, కథలు పుస్తకాలు లియో చైర్ పర్సన్ జి.కృష్ణవేణి, క్లబ్ సెక్రటరీ జి.లక్ష్మీ, పిపిఎఐ తెలంగాణ అధ్యక్షుడు సాగర్ల రఘు, డా.హిప్నో పద్మా కమలాకర్ అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ..ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువగా చూడవద్దని సూచించారు. సమస్యలను పంచుకోవడానికి దగ్గరలో స్నేహితులు లేదా పెద్దలు లేకపోవడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు వైపు పయనిస్తారని చెప్పారు. విఫలమైతే తల్లిదండ్రులు, సమాజం స్వీకరించరని భావిస్తారన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ప్రాక్టికల్ గా సెట్ చేసుకోవాలని తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రోత్సాహం , అండ ఇవ్వాలన్నారు. లియో చైర్ పర్సన్ జి.కృష్ణవేణీ మాట్లాడుతూ మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడండి, పంచుకోండి, సహాయం పొందండి” అనే నినాదాన్ని ప్రమాణం చేయించారు.
పిపిఎఐ తెలంగాణ అధ్యక్షుడు సాగర్ల రఘ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో సైకాలజికల్ కౌన్సెలింగ్ సర్వీసులు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. మార్కుల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా అంచనా వేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం లియో చైర్ పర్సన్ అయిన జి.కృష్ణ వేణిని విద్యార్థులు, జి.లక్ష్మీ, సాగర్ల రఘ, డా.హిప్నో పద్మా కమలాకర్ ఘనంగా సత్కరించారు. సమస్యలు ఉంటే @ 9390044031 ఈ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు అని తెలిపారు.
