ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారం పంచాయతీ వ్యవస్థ. ప్రజలే నేరుగా నిర్ణయాల్లో, పరిపాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ. పంచాయతీ ప్రజలందరితో కూడిన గ్రామసభదే అత్యున్నత నిర్ణయాధి కారం. ప్రత్యక్ష ప్రజాజోక్యం అనుమతించిన ప్రజాపాలనా వ్యవస్థ కూడా ఇదే! స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ, స్వయం పాలనాధి కారం కలిగిన ఏకైక పంచాయతీ రాజ్ వ్యవస్థ మనదేశంలోనే పురుడు పోసు కుంది. దీని మూలాలు చరిత్రలో వెతికినట్ల యితే అతిపురాతన మైనవి. 1500-500 బిసి వేదకాలంలోనే మన గ్రామ పరిపాలనా వ్యవస్థ మూలా లున్నాయి. మనదేశ నాగరికతలో కీలకమైన సింధూ నాగరికతలో సైతం ఆనాటి స్థానిక సంస్థల డ్రెయినేజీ వ్యవస్థ, స్నానఘట్టాలు కనిపిస్తాయి. మధ్య యుగాల నుండి బ్రిటిష్ పరిపాలనా కాలం వరకు స్థానిక స్వపరిపాలనా సంస్థల ఆనవాళ్లు చరిత్రలో కనిపిస్తాయి.అయితే, బ్రిటిష్ పరిపాలనా కాలం 19వ శతాబ్దంలో వీటిని ”రెవెన్యూ పంచాయతీ”గా ఏర్పాటు చేశారు.అంటే అనాడు ఈ వ్యవస్థ భూమి శిస్తు వసూలు, భూరికార్డుల నిర్వాహణలో కీలక భూమిక పోషించింది. ఇక మనకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1955లో ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ గ్రామ పంచా యతీ వ్యవస్థను పటిష్టం చేసే పనికి శ్రీకారం చుట్టాడు.అప్పట్లో పంచాయతీ, బ్లాకు, జిల్లాపరిషత్‌గా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ఇక ఇందిరాగాంధీ పరిపాలనా (1966-1977, 1980-1984) కాలంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలోని మధ్యమ వ్యవస్థ అయిన బ్లాకుకు బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ”పంచాయతీ సమితి” అనబడే మాధ్యమిక పరిపాలనా వ్యవస్థగా మార్పు చెందింది.కొన్ని రాష్ట్రాలలో బ్లాకుల రూపంలోనే ఈ వ్యవస్థ మనుగడలో ఉంది.
పంచాయతీ రాజ్ వ్యవస్థ పరోక్ష పద్ధతిలో ఎన్నికల వ్యవస్థ ఉండేది. ఎన్నికలు నిర్వహించడంతోపాటు, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి లభించింది కూడా ఈ కాలంలోనే! ఇకపోతే, రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బలోపేతం చేశారు.”ఒక ఐస్‌ముక్క చేతులు మారుతూ చివరి చేతికి వెళ్లేసరికి అది నీరుగా మారి ఐస్ మాయమైనట్లు” పంచాయతీ నిధులు అలా దుర్వినియోగమ వుతున్నాయని భావించి, నేరుగా కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు ”జవహార్ రోజ్ గార్” పేరుతో నిధులిచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేశారు. ఆయన (1984-89)కాలంలోనే 64వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికల విధానం తీసుకువచ్చారు. ఇక తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు తెచ్చారు. మాధ్యమిక వ్యవస్థ అయిన పంచాయతీ సమితి స్థానంలో పరిపాలనా సౌలభ్యం కోసం మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.దీంతో మనరాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసి), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పిటీసి)లను ఉనికిలోకి తెచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థకు నేరుగా ఎన్నికలు జరిపించారు.అయితే1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని విభాగం 9ని అనుసరించి, ఆర్టికల్ 243 జీవో ద్వారా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు చట్టబద్దత తెచ్చారు. ఇదే సమయంలో రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ ననుసరించి గిరిజన ప్రాంతాల్లో, మూలవాసీ నివాస అటవీ ప్రాంతంలో ”పీసా”చట్టం తీసు కొచ్చారు. దీనిప్రకారం గిరిజనులకు స్థానిక సంస్థల ద్వారా స్వయం పాలనా ప్రతిపత్తి కల్పించడం జరిగింది.దీనితో గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ తీర్మానం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదు.అంటే గ్రామసభ పటిష్టానికి శ్రీకారం చుట్టబడింది.గిరిజనుల స్వయం పాలనా హక్కుగా ఇది సంక్రమించింది.షెడ్యూల్ తెగల హక్కుల పరిరక్షణ ధ్యేయంగానే ‘పీసా’ చట్టం తేవడం విశేషం. అప్పటినుండి ఇప్పటివరకు ఇదే మూడంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థగా మన రాష్ట్రంలో ఉనికిలో ఉంది.
అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో స్వల్ఫ మార్పులతో పంచాయతీ రాజ్ చట్టాన్ని”తెలంగాణా పంచా యతీ రాజ్ చట్టం” పేరుతో తెచ్చారు. ఈచట్టం ప్రకారమే తెలంగాణా రాష్ట్రంలో 12,791 గ్రామ పంచాయ తీలు ఏర్పడ్డాయి.తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. తెలంగాణా రాష్ట్రంలో ఈచట్టం ద్వారానే స్థానిక సంస్థలకు కేంద్రం ఎనభై శాతం నిధులిస్తే, మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్రం ఇరవై శాతం నిధులు విడుదల చేసింది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రతి రెండు పంచాయతీలకు కలిపి ఒకరైతు వేదిక, ప్రతి గ్రామపంచాయతీకి వైకుంఠ ధామం, క్రీడా ప్రాంగణం, గ్రామ సచివాలయం నిర్మాణంతో పాటు గ్రామ పరిపాలన కోసం ”గ్రామ కార్యదర్శుల”ను నియమించింది.పంచాయతీ స్థాయిని బట్టి పారిశుద్ధ్య సిబ్బంది,వాహనం కొనుగోలుకు నిధులు విడుదల చేశారు. అయితే, ఎన్నికలు పూర్తయిన మూడేండ్ల తర్వాత కేంద్రప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజకీయ సంబంధాలు చెడటంతో ఆర్థిక సంబంధాలు చెడి స్థానిక సంస్థల నిధులు పెండింగ్‌లో పడ్డాయి.ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం (ఇజిఎస్), ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (ఐఆర్డిపి) నిదులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు? పంచాయతీ గ్రాంట్లు మంజూరు చేయకపోగా, కొన్ని పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం తదితర కారణాల వలన చిన్న గ్రామపంచాయతీకి రూ.2లక్షల నుంచి10లక్షలు,మేజర్ పంచాయతీ అయితే 20లక్షల నుంచి 40లక్షల వరకు సర్పంచులు పనులు చేయించి నిధులు రాక ఇబ్బందులు పడ్డారు. స్వయంగా ఆర్థిక స్థోమత లేని కొందరు సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీలు తీర్చలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే, 28 ఫిబ్రవరి 2024న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది.అయితే సర్పంచులకు రావాల్సిన బిల్లులు బీఆర్‌ఎస్ పాలనలో రెండేండ్లు, ప్రస్తుత పాలనలో ఒకటిన్నర ఏండ్లుగా ఎదురుచూపులు తప్ప పరిష్కారం కాలేదు? స్థానిక సంస్థల ఎన్నికలు పద్దెనిమిది నెలల కాలంగా వాయిదా పడుతూ వస్తున్నందున కేంద్రం స్థానిక సంస్థలకిచ్చే నిధులు విడుదల చేయడం లేదు. ఫలితంగా పంచాయతీలు ఆర్థికంగా దివాళా తీశాయి. ప్రస్తుతం పారిశుధ్యపని కోసం వాడే ట్రాక్టర్‌కు డీజిల్ పోయించని స్థితి పంచాయతీల్లో నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈఏడాది బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికిగాను రూ.31,426 కోట్లు కేటాయించింది. కానీ సమ స్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన రాష్ట్ర క్యాబినెట్ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నా దీనికి కేంద్రం సహ కరించడం లేదు. స్థానిక సంస్థలనందు రిజర్వే షన్లు మొత్తం యాభై శాతం మించరాదనే నిబంధన ఉంది. రాజ్యాంగ సవరణ లేకుండా ఇలాంటి మార్పును కోర్టులు అనుమతిస్తాయా? అన్న సంశయం కూడా ఉంది. ఏదిఏమైనా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తిరిగి వెంటనే పునరుజ్జీవింప చేయవలసిన అవసరం, కర్తవ్యం ప్రభుత్వంపై ఉంది. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ బాగుంటేనే మన గ్రామసీమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.
ఎన్.తిర్మల్
9441864514