కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు కుదించింది. ఇది దీపావళి కానుక అని ప్రధాని నరేంద్రమోడి ప్రకటించాడు. 28శాతం, 12 శాతం స్లాబులను రద్దు చేశారు. ఈ స్లాబుల కుదింపు మర్మమేమిటి? దీనివల్ల ప్రజలకు మేలు జరగనున్నదా? లేక బిహార్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను మభ్యపెట్టేందుకా? లేదా అసలు కారణం ఇంకా వేరే ఏదైనా ఉన్నదా? ఈ స్లాబుల కుదింపువల్ల అభివృద్ధి అంగలు వేస్తుందని, ప్రజా సంక్షేమం బలపడుతుందని పాలకులు చెబుతున్నారు. నిజమేనా?
పన్నుల చెల్లింపులో చేసిన మార్పులను దీపావళి కానుకగా ప్రధాని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎవరికి ఎవరు కానుకలిస్తున్నారు? ఎవరి సొమ్ము ఎవరికి చెల్లిస్తున్నారు? భారతదేశ ఆర్థికవ్యవస్థ భారాన్ని మోస్తున్నది ప్రజలు. పన్నుల చెల్లింపు ఇందుకోసమే కదా! మోడీ సొంత సొత్తు ఏదో ప్రజలకు పండుగ సందర్భంగా కానుకలిస్తునట్టు చెప్పుకోవడం అవివేకం. అంతేకాదు, దయతో ఇస్తున్నట్టు చెప్పుకునే భూస్వామ్య దురహంకార ధోరణి. అసలీ కుదింపుతో ప్రజలకు ఒరిగే ప్రయోజనమే ప్రశ్నార్థకం. ఇక నిత్యజీవితావసర సరుకుల అమ్మకాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని చెప్పుకోవటం అర్థరహితం. పాత జీఎస్టీ స్లాబులలో 28 శాతం స్లాబు ద్వారా జమవుతున్న ఆదాయం కేవలం పదకొండు శాతం మాత్రమే. 28 శాతం నుండి పది శాతానికి ఈ స్లాబు తగ్గించడం వల్ల ఈ స్లాబు ద్వారా వచ్చే ఆదాయం పదిశాతం తగ్గుతుంది. అంటే జీఎస్టీ ఆదాయంలో ఇది 1.1 శాతం మాత్రమే. ఇక పన్నెండు శాతం స్లాబును రద్దుచేయటం ద్వారా 5 శాతానికి కుదించడంతో ఈ స్లాబు నుండి రావాల్సిన ఆదాయం ఏడు శాతం తగ్గుతుంది. అంటే మొత్తం జీఎస్టీ ఆదాయంలో ఇది 0.37 శాతం. ఈ రెండు రాయితీలు కలిపినా అది కేవలం మొత్తం జీఎస్టీ ఆదాయంలో 1.45 శాతం మాత్రమే అవుతుంది. అంటే, ప్రజలకు మిగిలేది 1.45 శాతం మాత్రమే. ప్రభుత్వానికి ఈ మాత్రం ఆదాయం తగ్గినా పూడ్చుకునే మార్గమేమిటన్నది ప్రశ్న. అప్పు తెస్తే ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరుగుదలను సరళీకృత ఆర్థిక విధానాలు అంగీకరించవు. కాబట్టి ఖర్చు తగ్గించుకుంటారు. విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఇతర సబ్సిడీలకోసం వెచ్చించే ఖర్చునే కదా వీరు కోత పెట్టేది! అంటే జీఎస్టీ రూపంలో పన్ను కొంచెం తగ్గించినట్టే తగ్గించి, ఆమేరకు ఇతర రంగాల మీద ఖర్చు కోతపెడతారు. విద్యా, వైద్యం, సదుపాయాల కోసం ప్రజలు ప్రయివేటురంగం మీద ఆధారపడటం పెరుగుతుంది, ఇది ప్రజల మీద మోయలేని భారమౌతుంది. ఇక ప్రజలకు మేలు జరుగుతున్నదెక్కడీ ప్రజల చేతుల్లో మిగిలే సొమ్ము ఏమీ లేనప్పుడు అదనంగా సరుకుల కొను గోలు సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వ ఖర్చు తగ్గించడం వల్ల అభివృద్ధి మందగిస్తుంది. అంటే అభివృద్ధి పెరిగేదీ లేదు, సంక్షేమం ఒరిగేదీ లేదు. ఇప్పుడు ప్రధాని గొప్పగా చెప్పుకున్న దీపావళి కానుక కొత్త నాటకమేనని తేలుతున్నది కదా! ఎందుకీ నయా నాటకం?
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ తిమ్మిని బమ్మిని చేస్తూ మాట్లాడారు. గత దశాబ్ద కాలంలో తయారీ రంగం వేగంగా అంగలు వేసిందని చెప్పుకున్నారు. వాస్తవాలు ఇందుకు భిన్నం. గత పదేండ్లలో స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 17.5 శాతం నుండి 12.6 శాతానికి పడిపోయింది. ఆర్థిక సర్వే రిపోర్టు ఏం చెప్పిందో ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఒకసారి చదువుకుంటే మంచిది. తయారీ రంగం అభివృద్ధి క్షీణిస్తున్నదని, ఉపాధి అవకాశాలు పడిపోతున్నా యని, ప్రజల నిజవేతనాలు, ఆదాయాలు తగ్గిపోయాయని చెప్పింది. ధరలు విపరీతంగా పెరగటమే కాకుండా, ఆహార సరుకుల ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని తేల్చిచెప్పింది. తన ప్రభుత్వ సొంత నివేదికలనే పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకోసం తోచింది మాట్లాడటం ప్రధానమంత్రి స్థాయిలో తగదు.
ఇప్పటికే దేశంలో ఆర్థిక అసమానతలు ప్రమాదపుటంచుకు చేరుతున్నాయి. దేశంలో ఉన్న మొత్తం సంపదలో అరవైశాతం అంటే సగానికి మించి కేవలం ఒక శాతం ప్రజల దగ్గర పోగుపడింది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన సంస్థ బెర్న్‌స్టీన్ తేల్చిన సత్యమిది. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఫ్రెంచ్ ఆర్థిక వేత్త పికెట్టి మరో నిజం బట్టబయలు చేశారు. బ్రిటీష్ పాలన నాటి కంటే కూడా ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. మరోవైపు ఒక్క ఏడాది కాలంలోనే మోడీ పాలనలో వంద మంది శతకోటీశ్వరుల సంపద మూడింతలైంది. సుమారు మరో ఎనభై మందికి పైగా కొత్త శతకోటీశ్వరులు పుట్టు కొచ్చారు. ఒకవైపు ప్రజల నిజ ఆదాయాలు పడిపోతున్నాయి. మరోవైపు బడాబాబులు బలిసిపోతున్నారు. ఇక ఆర్థిక అసమానతలు పెరగక ఏమౌతుంది? గత బడ్జెట్‌లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలకు కేటాయింపులు తగ్గించింది. అయినా తయారీరంగం అంగలు వేస్తూ ముందుకు సాగుతుందని చెప్పుకోవడం మరీ హాస్యాస్పదం. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ దీపావళి కానుక పేరుతో కొత్త నాటకానికి తెరలేపటం వెనుక కచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండాలి. ఉన్నది కూడా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ గౌరవ మర్యాదలను మంటగలుపుతున్నాడు. భారత దేశంలో అమెరికా సరుకులు అమ్ముకొని లాభాలు గడించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. మనదేశ ప్రయోజనాలకు భిన్నంగా భారతదేశ మార్కెట్‌ను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికా వ్యవసాయోత్పత్తులను మన దేశంలో స్వేచ్ఛగా అమ్ముకోవడానికి వీలుగా తమ సరుకుల మీద మన దేశంలో దిగుమతి సుంకాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆమేరకు ఒప్పందం మీద సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారు. ఇందుకోసమే అమెరికాలో అమ్ముకునే భారతదేశ సరుకుల మీద ఇరవై ఐదుశాతం దిగుమతి సుంకం పెంచారు. అంతేకాదు, మనదేశం రష్యా నుండి చమురు, ఆయుధాల కొనుగోలు చేస్తున్నందుకు మరో ఇరవై ఐదు శాతం జరిమానా పేరుతో మన సరుకుల మీద దిగుమతి సుంకం పెంచారు. అంటే, భారతదేశం ఎగుమతి చేస్తున్న సరుకుల మీద యాభైశాతం సుంకం విధించారు. భారతదేశాన్ని లొంగదీసుకునేందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మోడీ మాత్రం నోరు మెదపడం లేదు. దిగుమతి సుంకాలు రద్దు చేస్తామని భారత ప్రభుత్వం అంగీకరిస్తున్నదన్నారు ట్రంప్. తాము యాభై శాతం సుంకాలు పెంచడం వల్లనే భారతదేశం దిగివచ్చిందని ట్రంప్ చెప్పుకున్నారు. అయినా మోడీ మాట్లాడలేదు. ట్రంప్ బెదిరిస్తే ప్రధాని లొంగి పోతున్నారా? ఈ అనుమానం ప్రజలకు రావటం సహజమే కదా! ట్రంప్, మోడీల మధ్య జరిగిన గత సమావేశం తర్వాత వారం తిరగక ముందే కొన్ని అమెరికా సరుకుల మీద మన ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించింది. అప్పుడే ప్రజలకు అనుమానం మొదలైంది. అమెరికా నుండి పత్తి దిగుమతుల మీద మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకం రద్దు చేయడంతో పత్తి రైతులు బెంబేలెత్తుతున్నారు. కేంద్ర పాలకుల వైఖరి పట్ల అనుమానాలకు బలం చేకూరుతున్నది. అమెరికా సరుకుల మీద దిగుమతి సుంకం రద్దు చేస్తామని ఒప్పుకున్నట్టుగా ట్రంపు చేసిన ప్రకటన నిజమేనా? మోడీ మౌనం ఈ ప్రశ్ననే ముందుకు తెస్తున్నది. అదే జరిగితే భారతీయ రైతుల బతుకులు బజారున పడతాయి. పత్తి, గోధుమ, సోయా చిక్కుడు, పాడి, పౌల్ట్రీ రైతులు దివాళా తీస్తారు. తెలంగాణ రైతాంగం మీద కూడా ఇది తీవ్రప్రభావం చూపుతుంది. భారతదేశ సరుకుల మీద అమెరికా ప్రభుత్వం యాభై శాతం సుంకం పెంచిన ఫలితంగా ఔషధాలు, బట్టల పరిశ్రమ, వజ్రాలు, వైడూర్యాల వ్యాపారం దెబ్బతినడంతో కార్మికుల మీద ప్రభావం మొదలైంది. అమెరికా అంతటితో ఆగలేదు. రష్యా నుండి చవకగా అందుతున్న చమురును కొనుగోలు చేయవద్దని మన మీద ఆంక్షలు విధిస్తున్నది. పాకిస్థాన్‌తో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ అమెరికా పాలకులు పాకిస్థాన్‌కే అండగా నిలిచారు. రష్యా భారతదేశానికి సహాయం చేసింది. రష్యాతో భారతదేశ వ్యాపార సంబంధం దశాబ్దాల బంధం. ఆ బంధాన్ని తెంచుకోవాలని అమెరికా బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా చెప్పేందుకు కూడా ట్రంప్ సలహాదారు సాహసించాడు. ఉక్రెయిన్‌ను ఎగదోసింది అమెరికా. రష్యాను యుద్ధ రంగంలోకి గుంజింది అమెరికా.
ఈ యుద్ధంలో ఆయుధాలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నది కూడా అమెరికా. ఇప్పుడీ యుద్ధాన్ని ‘మోడీ యుద్ధం’ గా ఆరోపించటం దుస్సాహసం. భారతదేశ యువతకు తమ సంస్థల్లో ఉద్యోగాలివ్వవద్దని గూగుల్, ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలకు నెలరోజుల క్రితమే ట్రంప్ హెచ్చరిక చేశాడు. ఇప్పుడు ఆపిల్ సిఇఓ టిమ్‌కుక్, గూగుల్ సిఇఓ సుందర్ పిచారు, మెటా సిఇఓ మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యానాదేండ్ల లాంటి టెక్ దిగ్గజాలను విందుకు పిలిచి ఇక నుండి తామంతా అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ చెప్పాడు. అంటే, భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పటమే. ఇన్ని జరుగుతున్నప్పటికీ మన దేశ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం మౌనముద్ర వీడలేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ప్రజలకు భారతదేశ ప్రభుత్వం మీద అమెరికా పెత్తనం పెరుగుతున్నదన్న భయం మొదలైంది. విశ్వగురువని చెప్పుకున్న ప్రధాని ఇప్పుడు ‘ అమెరికా ఫస్ట్ ‘ అని విర్రవీగుతున్న ట్రంపుకు తలవంచటమంటే 143 కోట్ల ప్రజలకు తలవంపే కదా! మోడీ ఎంత మౌనంగా ఉన్నప్పటికీ ట్రంప్ దూకుడు మాత్రం ఆగటం లేదు. ఈ విషయాల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చడం కోసమే దీపావళి కానుక పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టారు. పనిలోపనిగా బీహార్ ప్రజలను కూడా మభ్యపెట్టే పనిలో ఉన్నారు. మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు బడా బాబుల మీద సంపద పన్ను, వారసత్వపు పన్ను వేయాలి. కార్పొరేట్ పన్ను పెంచాలి. అంతేతప్ప, జీఎస్టీ స్లాబుల పేరుతో చేసే విన్యాసాల వల్ల ఫలితం ఉండదు. ఇది కేవలం ప్రజలను మోసగించడమే.
ఎస్.వీరయ్య